Bikkanoor | భిక్కనూర్, జులై 13: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఏక్ భారత్–శ్రేష్ఠ భారత్’ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ–హర్యానా రాష్ట్రాల మధ్య చేపట్టనున్న ఎక్స్పోజర్ విజిట్‌కు భిక్కనూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు శ్రీలక్ష్మి, రిషిక ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు శ్రీనాథ్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం వివరాలు వెల్లడించారు. జూలై 15 నుంచి 22 వరకు హర్యానాలో జరిగే ఈ పర్యటనలో విద్యార్థినులు చారిత్రక ప్రదేశాలు, విద్యాసంస్థలు, సాంస్కృతిక కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించడంతో పాటు అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, భాష, కళలు, జీవన విధానాన్ని అధ్యయనం చేయనున్నారు.
అలాగే తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని హర్యానా విద్యార్థులకు పరిచయం చేయనున్నారు. జాతీయ సమైక్యత, భిన్నత్వంలో ఏకత్వ భావనను పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని హెచ్ఎం పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తెలంగాణకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు భవాని, ఉపాధ్యాయ బృందం విద్యార్థినులను అభినందించి, పర్యటన విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు.