కొత్తిమీర.. వంటింటికి నిత్యావసర వస్తువు. ఏ కూర వండినా కొత్తిమీర వేయాల్సిందే! అన్ని కాలాల్లోనూ డిమాండ్ ఉంటుంది. చిన్న కట్ట కూడా రూ.10 దాకా పలుకుతుంది. వేసవిలోనైతే రూ.20 పెట్టినా దొరకని పరిస్థితి. ఇక కొత్తిమీర విత్తనాలది(ధనియాలు) సుగంధ ద్రవ్యాల్లో ప్రముఖ స్థానం. ఇటు వ్యవసాయంలోనూ రైతులకు నిత్య ఆదాయం తీసుకొచ్చే పంటగానూ గుర్తింపు పొందింది. 365 రోజులూ సాగవుతూ, కర్షకుల ఇంట కనక వర్షం కురిపిస్తున్నది. కొత్తిమీర పంట నెలలోనే చేతికందుతుంది. అందుకే, ఈ చిన్న పంటను సాగు చేయడానికి రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. తక్కువ నీటితో సాగు చేస్తూ లాభాలు గడించవచ్చని చెబుతున్నారు కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల రైతులు.
కూరకు కొత్త రుచిని తీసుకొచ్చే కొత్తిమీర.. రైతుకు మంచి ఆదాయాన్నీ అందిస్తున్నది. పెద్ద పంటలతో నష్టపోతున్నవారికి చిన్నపంట అయినా ఆసరాగా నిలుస్తున్నది. స్వల్పకాలంలోనే చేతికొందుతూ కర్షకుల కష్టాలను తీరుస్తున్నది. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని వివిధ గ్రామాల్లో యాసంగి సీజన్లో రైతులు ధనియా(కొత్తిమీర)ను సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందుతున్నారు. ధనియాల పంటకు పురుగు బెడద తక్కువ ఉండడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు.
ఒక ఎకరం భూమిలో ట్రాక్టర్ ద్వారా 12 కేజీల ధనియా విత్తనాలు వేస్తున్నారు. విత్తనాలు వేసే సమయంలో ఒక బస్తా డీఏపీ, మరో బస్తా యూరియాను చల్లుతున్నారు. మొలకెత్తిన తర్వాత 60 రోజుల్లో ధనియాల పంట కోతకు వస్తుంది. ఎకరానికి రూ.4వేల పెట్టుబడి ఖర్చు అవుతుంది. దిగుబడి ఎకరానికి 7క్వింటాళ్లు ఉండడంతో రైతులు ఆనందంగా సాగు చేస్తున్నారు. ధనియాల ధర మార్కెట్లో క్వింటాల్ రూ. 12వేలు ఉండగా, ఎకరం పంట సాగు చేస్తే రూ.84వేలు చేతికందుతున్నాయి. ఎకరానికి పంట మొదలు నుంచి కోత వరకు మొత్తం ఖర్చు రూ.10వేలు కాగా, పంట చేతికి వచ్చాక సుమారు రూ.74వేలు మిగులుతుండడంతో ధనియాల పంటను సాగు చేస్తూ అధిక లాభాలు పొందుతున్నారు.
15 ఎకరాల్లో సాగు చేస్తున్నా..
నాకు 15 ఎకరాల భూమి ఉన్నది. యాసంగిలో మొత్తం ధనియా సాగు చేస్తున్నా. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుంది. మహారాష్ట్రలోని నాందెడ్ మార్కెట్లో క్వింటాల్ ధనియాలకు రూ.12వేల రేటు ఉంది. పెట్టుబడి ఖర్చులు పోను ఎకరానికి 74వేలు మిగులుతున్నాయి. గత సంవత్సరం ధనియాలు సాగు చేయగా లాభాలు వచ్చాయి. అందుకే ఈ సంవత్సరం కూడా ధనియా సాగు చేస్తున్న.
– హన్మంత్‌రావు పటేల్, రైతు, బిచ్కుంద
ధనియా సాగుకు రైతుల మొగ్గు..
మండలానికి చెందిన రైతులు యాసంగి సీజన్లో సుమారు 1500 ఎకరాల్లో ధనియాలను సాగు చేస్తున్నారు. మహారాష్ట్రలోని మార్కెట్లో ధనియాలకు మంచి ధర పలుకుతుండడంతో బిచ్కుంద రైతులు ధనియా సాగుకు మొగ్గు చూపుతున్నారు. ధనియా పంటకు క్రిమిసంహారక మందుల పిచికారీ చేయాల్సిన అవసరం లేకపోవడం, పెట్టుబడి తక్కువ.. లాభం ఎక్కువగా ఉండడంతో రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.
– పోచయ్య, మండల వ్యవసాయాధికారి, బిచ్కుంద