నిజామాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్‌లో విష సంస్కృతి రెక్కలు విప్పుకుంటున్నది. మెట్రో సిటీస్‌కే పరిమితమైన నయా కల్చర్ ఇప్పుడు ఇందూరుకూ విస్తరించింది. బెట్టింగ్, పేకాట, హైటెక్ వ్యభిచారం, గంజాయి.. ఇలా అన్ని అసాంఘిక కార్యక్రమాలకు నగరం అడ్డాగా మారింది. జిల్లాలో డ్రగ్స్ వినియోగం లేదని అధికారులు చెబుతున్నా, అంతర్గతంగా ఆ దరిద్రం కూడా వేళ్లూనుకుంది.
హైటెక్ వ్యభిచారం, బెట్టింగ్ జూదం తరచూ బయట పడుతూనే ఉంది. హోటళ్లు, ఫాం హౌస్‌లు, నివాసాలు, చివరకు దవాఖానాలు సైతం అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఇటీవలే నగర శివారులోని ఓ స్టార్ హోటల్లో పేకాట, హైటెక్ వ్యభిచారం వెలుగులోకి వచ్చిన ఘటన మరువక ముందే, తాజాగా ఓ ప్రైవేట్ దవాఖానలో పేకాడుతూ మహిళలు పట్టుబడడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న విష సంస్కృతిపై రోజంతా చర్చ జరిగింది.
అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించడం పోలీసులకు సవాల్‌గా మారింది. నిత్యం ఎక్కడో ఓ చోట పేకాటరాయుళ్లు పట్టుబడుతున్నారు. తరచూ వ్యభిచార ముఠాల ఆగడాలు బయట పడుతూనే ఉన్నాయి. గంజాయి విక్రయాలకైతే అడ్డే లేకుండా పోయింది. హోటళ్లు, లాడ్జీలే కేంద్రంగా బెట్టింగ్ వ్యవహారాలు నడుస్తున్నాయి. గుట్టుగా సాగుతున్న చీకటి దందాలపై పోలీసులు నిఘా పెడుతున్నా చాప కింద నీరులా పాకుతూనే ఉంది. ఓ చోట దాడి చేస్తే మరో చోట స్థావరాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసు దాడుల నుంచి తప్పించుకునేందుకు పూటకో అడ్డా మారుస్తున్నారు.
గతంలో నిఘా విస్తృతంగా ఉన్న సమయంలో కొందరు ఓమ్ని వంటి వాహనాల్లో తిరుగుతూ పేకాట ఆడిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు శివారు ప్రాంతాలు పత్తాలాటకు అడ్డాలుగా మారాయి. కొత్త, పాత హోటళ్లు అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా అక్రమాలు జరుగుతున్నాయి. పోలీసుల నిబంధనలకు అనుగుణంగా గదుల బుకింగ్ జరగడం లేదు. ఆధార్ కార్డు ప్రూఫ్ లేకుండానే ఇష్టానుసారంగా గదులను ఇచ్చేస్తున్నారు. ఒక్కో గదిలో 10-20 మందితో పేకాట ఆడిస్తున్నారు. ఇదే అదనుగా మగరాయుళ్ల కోరికలను తీర్చేందుకు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ వంటి నగరాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి హైటెక్ వ్యభిచారం చేయిస్తున్న వైనం ఈ మధ్యే వెలుగు చూడటం కలకలం రేపింది.
నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆధునిక పోకడలు పెరిగి పోయాయి. అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. వాటిని నిర్మూలించడం పోలీసులకు పెను సవాల్‌గా మారింది. హోటళ్లు, లాడ్జీలు, ఫాంహౌస్‌లు, నగర శివారు ప్రాంతాల్లోని కొన్ని అడ్డాలు అక్రమ వ్యవహారాలకు చిరునామాగా మారాయి. మెట్రోపాలిటన్ నగరాలకే పరిమితమైన ఆధునిక విష సంస్కృతి ఇక్కడకూ విస్తరించింది.
దావత్‌లు, కిట్టీ పార్టీల పేరిట విందులు, చిందులు, మరెన్నో అకృత్యాలు కొనసాగుతున్నాయి. డీజేలు పెట్టుకుని డ్యాన్సులు చేయడం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవించడం నిత్యకృత్యమైంది. రేవ్ పార్టీల స్థాయిలో కాకపోయినా ఆ తరహాలో జిల్లాలో పార్టీలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి మహిళలను తీసుకొచ్చి డ్యాన్సులతో పాటు వ్యభిచారం చేయించిన ఉదంతం.. జిల్లాలో పెరిగిపోతున్న విచ్చలవిడితనానికి నిదర్శనంగా మారింది.
సంపాదన పెరిగి పోవడంతో విపరీత అలవాట్లు వెంటాడుతున్నాయి. సకల సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో ఫాం హౌస్ సంస్కృతి పెరిగింది. సేదదీరేందుకు నిర్మించుకున్న కొన్ని వ్యవసాయ క్షేత్రాలు ఇతరాత్ర కార్యకలాపాలకు వేదికలుగా మారాయి. విచ్చలవిడిగా డబ్బులు సంపాదిస్తున్న వారంతా నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బోధన్, బాల్కొండ నియోజకవర్గాల్లో, అలాగే, 44వ జాతీయ రహదారికి కూత వేటు దూరంలో రూ.కోట్లు పెట్టి కొనుగోలు చేసిన భూముల్లో స్విమ్మింగ్ ఫూల్ సౌకర్యాలతో విలాసవంతమైన ఫాం హౌస్‌లు నిర్మించుకున్నారు. ప్రైవేట్ ఫాం హౌస్‌లు కావడంతో అందులో ఏం జరుగుతుందనేది పోలీసులకు తెలియడం లేదు. మరోవైపు, స్థానికంగా జరిగే అక్రమాలకు అక్కడి పోలీసుల సహకారం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. పేకాట స్థావరాలపై జరుగుతున్న దాడులన్నీ టాస్క్‌ఫోర్స్ పోలీసులవే కావడం ఇందుకు బలం చేకూర్చుతున్నది.