కంఠేశ్వర్ జూన్ 23 : బెస్ట్ అవైలబుల్ స్కూల్ పెండింగ్ బిల్లులు చెల్లించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బెస్ట్ అవైలబుల్ స్కీం కింద చదువుతున్న ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన సామాజిక వర్గం విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 26,000 మంది విద్యార్థులు ఈ స్కీంలో చదువుతుండగా ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు 300 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు పాఠశాలలకు చెల్లించకపోవడంతో పాఠశాలల యజమాన్యం ప్రస్తుత విద్యా సంవత్సరంలో బెస్ట్ అవైలబుల్ స్కీం కింద విద్యార్థులను చదువుకోడానికి అనుమతించకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడిందన్నారు.
పాఠశాలలు ప్రారంభమై 12 రోజులు గడుస్తున్నా కూడా విద్యాసంస్థల నుంచి తల్లిదండ్రులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదన్నారు. ప్రభుత్వం తరఫునుంచి రావాల్సిన బకాయి రావడంలేదని, కావాలనుకుంటే ఫీజులు చెల్లించి పాఠశాలకు పంపాలని లేనిపక్షంలో పిల్లల్ని పాఠశాల తీసుకురావద్దని యాజమాన్యం చెప్పడంతో గత్యంతరం కలెక్టర్కు తమ గోడు విన్నవించుకోవడానికి వచ్చామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం బకాయిలు చెల్లించి పిల్లలను ఆదుకోవాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు.