బాన్సువాడ, జూలై 13: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజల దృష్టి మరల్చడానికే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ పేరిట సరికొత్త డ్రామాకు తెరతీసిందని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బాన్సువాడ పట్టణంలో ఆదివారం నిర్వహించిన బోనాల పండుగలో ఆయన పాల్గొన్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ పేరిట రేవంత్ సర్కార్ కొత్త నాటకానికి తెరలేపిందన్నారు. ప్రజలకు ఏం చేశారని సంబురాలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించా రు.
ప్రజలకు ఇచ్చిన హామీలైన రూ. 2 లక్షల రుణమాఫీ, వడ్లకు బోనస్ ఏమైందని నిలదీశారు. రైతులకు బీమా సౌకర్యం కూడా కల్పించడం లేదన్నారు. పింఛన్ రూ. 4వేలకు పెంపు, ఆడబిడ్డలకు స్కూటీలు, మహిళలకు రూ.2,500 హామీలు ఎటుపోయాయని ప్రశ్నించారు. వీటన్నింటినీ ప్రజలు మర్చిపోవాలని బీసీ రిజర్వేషన్ అంశాన్ని పెద్దగా చేసి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుంద ని, కాంగ్రెస్ పార్టీతో ఏమీకాదని ప్రజలకు తెలిసిపోయిందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టిందని గుర్తుచేశారు. సర్వే ప్రకారం 36 శాతం జనాభా ఉన్న బీసీలకు స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పించినట్లు తెలిపారు. పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్లు తాను సర్వే చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాడని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో ఎన్నో అవకతవకలు చోటుచేసుకున్నాయన్నారు. కొన్ని కులాల సంఖ్యను పెంచి, కొన్ని కులాల జనాభాను తగ్గించారని ఆరోపించారు.
సర్వే చేసిన తర్వాత అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లు పాస్ చేశారని, 42శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి, కేంద్రానికి పంపించాడని తెలిపారు. హైకోర్టు మూడు నెలల్లో ఎన్నికలు పెట్టాలని మొట్టికాయలు వేయడంతో ఆర్డినెన్స్ పేరుతో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు విషయంలో కేంద్రం వద్దకు అఖిల పక్ష కమిటీని తీసుకువెళ్తానని, ప్రధానమంత్రిని కలుస్తానని తప్పకుండా సాధిస్తానని చెప్పాడని గుర్తుచేశారు. కానీ నిజాయితీ ఎక్కడ ఉందని, అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకుపోయావా అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.
బీజేపీతో కుమ్మక్కు
బీజేపీతో రేవంత్ రెడ్డి సర్కార్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నదని ఆరోపించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ , కిషన్‌రెడ్డి, రఘునందన్‌రావు తో కలిసి ప్రధాన మంత్రి వద్దకు వెళ్లి పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి , ఆమో దం పొందేలా చేస్తే ప్రజలు నమ్ముతారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. గతంలో బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డి చేపట్టే సర్వేలో నిజాయితీ లేదని అన్నారని, తాము ఆ సర్వేను ఒప్పుకోబోమని చెప్పారని గుర్తుచేశారు. ఎవరైనా కోర్టుకు వెళ్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
ఇంకా ఎవరైనా వ్యతిరేకిస్తే సామాజిక బహిష్కరణ చేస్తానని పనికిరాని డైలాగ్‌లు చెబుతున్నారని మండిపడ్డారు. కొన్ని గ్రామా ల్లో సామాజిక బహిష్కరణ చేసిన వీడీసీ వారు జైలుకు వెళ్తున్నారని, మరి సీఎం కూడా పోతారా అని ఎద్దేవాచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి చేయించుకున్న సర్వేలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని తేలిందన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే గెలవదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు అవుతున్నా స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు నిర్వహించడంలేదంటే ఆ పార్టీని ఓడిపోతామనే భయం వెంటాడుతున్నదని తెలిపా రు. నిజాయితీ ఉంటే ఇప్పటికైనా అఖిల పక్షం నాయకులను ప్రధాని వద్దకు తీసుకెళ్లితే తప్ప ఎవరూ రేవంత్‌రెడ్డిని నమ్మరని పేర్కొన్నారు.