సుభాష్‌నగర్, అక్టోబర్ 1: మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక.. ఆడబిడ్డల ఆత్మీయ వేడుక బతుకమ్మ. తెలంగాణకు మాత్రమే పరిమితమైన ఈ పూల పండుగ రానే వచ్చింది. నేటి (బుధవారం) నుంచి తొమ్మిది రోజుల పాటు ఈ వేడుక జరుగనున్నది. ఎంగిల పూల బతుకమ్మతో ప్రారంభమై, అక్టోబర్ 10న సద్దుల బతుకమ్మతో ముగియనున్నది. ప్రకృతిని కొలవడమే పరామర్థంగా సాగే ఈ పండుగ మహిళలకు మాత్రమే ప్రత్యేకం. భక్తిశ్రద్ధలతో ప్రకృతిని కొలుస్తూ తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆడి పాడుతారు. పాడిపంట, పిల్లజల్ల బాగుండాలని బతుకమ్మ రూపంలో ఉండే గౌరమ్మను వేడుకుంటారు.
ఒక్కోరోజు ఒక్కో పేరుతో..
ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పూల పండుగ బతుకమ్మ. ఆడబిడ్డలకు ఎంతో ఇష్టమైన ఈ వేడుకకు మహిళలు అత్తింటి నుంచి పుట్టింటికి చేరుకుంటారు. ప్రకృతిలో లభించే తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడి నీటిలో నిమజ్జనం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ కార్యక్రమానికి తొమ్మిది పేర్లు ఉన్నాయి. తొలిరోజు బతుకమ్మను (3న) బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ, రెండో రోజు అటుకల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్ద బతుకమ్మ, తొమ్మిదొ రోజు సద్దుల బతుకమ్మ.. ఇలా రోజుకో విధంగా గౌరమ్మను కొలుస్తారు. చివరి రోజు ఆడబిడ్డలు ఆడిపాడి పోయిరా బతుకమ్మ, పోయిరావమ్మ… మళ్లొచ్చే ఏడాది తిరిగి రావమ్మ.. అని వీడ్కోలు పలుకుతారు. నీళ్లల్లో నిమజ్జనం చేశాక వాయినం ఇచ్చిపుచ్చుకుంటారు.
ఇంటి దేవతగా కొలుస్తాం
తెలంగాణ పండుగ బతుకమ్మ బొడ్డెమ్మతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు రోజుకో ప్రత్యేకత ఉంది. బతుకమ్మను ఇంటి దేవత గౌరమ్మగా కొలుస్తాం. 2014లో బంగారు బతుకమ్మ పేరుతో పుస్తకం రాశా. 33 జిల్లాల ఆటపాటలు, బతుకమ్మ ప్రాముఖ్యత తదితర అంశాలు ఎన్నో ఉన్నాయి.
– సౌమ్య, రచయిత్రి, ఎల్లమ్మగుట్ట
ఆడబిడ్డల పండుగ
బతుకమ్మ పూల పండుగ. ఇది ఆడబిడ్డల పండుగ. ఊరంతా సందడిగా ఉంటుంది. దేవున్ని పూజించడంతో పాటు ప్రకృతి పూలు, చల్లని శీతాకాలం ప్రారంభాన్ని సూచించే పూల జాతర.
– విజేత, ఉపాధ్యాయురాలు, గంగాస్థాన్
బంధుత్వం, ఆప్యాయతలు..
బతుకమ్మ పాటల్లో కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, అప్యాయతలు, భక్తి అన్ని ఉంటాయి. రకరకాల పూలు తెచ్చి బతుకమ్మను పేర్చి ఆడిపాడడం ఎంతో ఆనందంగా ఉంటుంది. బతుకమ్మ పండుగ తెలంగాణ సౌందర్యం, ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తుంది.
– శాంత, గృహిణి, సీతారాం నగర్ కాలనీ