పదో తరగతి పేపర్ల లీకేజీ వ్యవహారం వెనుక బీజేపీ కుట్రకోణం వెలుగు చూసింది. బండి సంజయ్ ఆధ్వర్యంలోనే లీకుల పర్వం కొనసాగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తెలంగాణపై మొదటి నుంచి కక్షగట్టిన బీజేపీ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే ఏకైక లక్ష్యంతో కుట్రలకు తెరలేపింది. లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోవడమే కాకుండా వారి తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేస్తున్నది. బీజేపీ లీకేజీల కుట్రలు బయటికి రావడంతో తల్లిదండ్రులతో పాటు సామాన్య జనం సైతం కాషాయ పార్టీ నేతలపై కస్సుమంటున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇంత దిగజారుతారా? అని ఛీత్కరించుకుంటున్నారు. బుధవారం జిల్లాలో పలుచోట్ల బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఇలా దిగజారడంపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, గణేశ్ గుప్తా నిప్పులు చెరిగారు.
– నిజామాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో అశాంతి, అలజడిని సృష్టించేందుకు భారతీయ జనతా పార్టీ కుట్రలను పన్నుతున్నది. ఇందులో భాగంగా ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో అతిగా ప్రవర్తిస్తూ నోటికొచ్చిన ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నది. దర్యాప్తు సంస్థలను పక్కదారి పట్టించే విధంగా వ్యవహరిస్తూ బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ కేవలం రాజకీయ లబ్ధి కోసమే నెల రోజులుగా వీధి నాటకాలకు తెరలేపాడు. ఇప్పుడేకంగా టీఎస్పీఎస్సీ వ్యవహారంతో పాటుగా టెన్త్ పరీక్షల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు లీకేజీ కుట్రల్లో స్వయంగా భాగస్వామిగా ఉండి నీచమైన వ్యవహారాన్ని నడిపి పోలీసులకు అడ్డంగా చిక్కాడు. లక్షలాది మంది యువత, పదో తరగతి పరీక్షలు రాస్తున్న వారి జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతున్నది. బీఆర్ఎస్ పార్టీని ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే దమ్మూ ధైర్యం లేక దొడ్డి దారిలో కుట్ర పూరితంగా బురద జల్లి తద్వారా రాజకీయ లబ్ధిని పొందేందుకు కాషాయ పార్టీ యోచిస్తుండడంపై సభ్య సమాజం బీజేపీని ఛీ కొడుతోంది. ఇదేం తీరు అంటూ తిట్ల దండకం అందుకుంటున్నది.
అడ్డంగా చిక్కి ఆగమాగం చేసి..
అన్నమో.. అటుకులో తిని, ఉపవాసాలు ఉంటూ అహర్నిశలు తెలంగాణ నినాదమే శ్వాసగా పద్నాలుగేండ్లు కొట్లాడి స్వరాష్ట్ర కలను సాకారం చేసుకున్నాం. ఇప్పుడు కపట ప్రతిపక్ష పార్టీల మాటలను పట్టించుకోకుండా తెలంగాణ అభివృద్ధి కోసం నడుం బిగించాలంటూ భార త రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనేక పబ్లిక్ మీటింగుల్లో చెబుతుంటారు. తెలంగాణ కోసం చావు నోట్లో తలకాయ పెట్టి కొట్లాడిన పెద్ద మనిషి సీఎంగా ఉన్న ఈ సమయంలో తెలంగాణ సమాజానికి ఇబ్బంది కలిగే చర్యలను ప్రజలెవ్వరూ ఊహించరు. ఇది కేవలం కల్పిత కథలతో, కుట్రపూరితంగా, ఉద్దేశపూర్వకం గా అల్లుతున్న ఆరోపణలు, రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్న ప్రతిపక్ష పార్టీల మైండ్ గేమ్ తప్ప ఇంకేమీ కాదన్న విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు.
తాజాగా టెన్త్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ ఆడుతున్న ఆటలన్నీ ఎక్కడికక్కడ బహిర్గతం అవుతున్నా యి. కాషాయ పార్టీకి అనుబంధంగా ఉండే ఉపాధ్యాయ సంఘం బాధ్యులే వికారాబాద్‌లో తెలుగు పేపర్లను లీకేజీ చేశారు. అటు తర్వాత హనుమకొండలోనూ బీజేపీ కార్యకర్తలే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి డైరెక్షన్లో కథను నడిపి అడ్డంగా పోలీసులకు చిక్కారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా టీఎస్పీఎస్సీ, టెన్త్ పరీక్షల్లో పేపర్ల లీకేజీ వెనుక ఉన్న కుట్రలు, వ్యక్తులను తప్పనిసరిగా సీఎం కేసీఆర్ సర్కారు గుర్తించి శిక్షిస్తారనేది జగమెరిగిన సత్యం. ఘటన జరిగిన వెంటనే స్పందించి పేపర్ లీకేజీ నిందితులను అరెస్టు చేసి సమగ్ర విచారణను కొనసాగిస్తున్నారు. అది ప్రభుత్వానికి తెలంగాణ సమాజంపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. కానీ ఈ ఘటనను ఒక బూచీగా చూపెట్టి రాష్ట్ర ప్రభుత్వంపై అభాండాలు వేసే బీజేపీ దుశ్చర్యను ముక్తకంఠంతో అందరూ వ్యతిరేకిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలోనూ ఇదే తంతు..
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ బీజేపీ నేతల తీరు ఇదే తంతును తలపించిన అనుభవాలు కోకొల్లలుగా ఉన్నాయి. బాన్సువాడలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఏకంగా అభం శుభం తెలియని ఓ బాలుడిని తన రాజకీయ స్వార్థానికి వాడుకొని వదిలేశాడు. రాజకీయం అంటేనే తెలియని పిల్లాడి చేత స్పీకర్ పోచారాన్ని తిట్టించి పైశాచికత్వ ఆనందాన్ని పొంది అనంతరం అభాసుపాలయ్యారు. అనంతరం బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పా టు చాటున మత ఘర్షణలకు బీజేపీ కుట్రలు చేసింది. రాజకీయ లబ్ధికి ప్రయత్నించగా.. శాంతి, భద్రతల సమస్యగా భావించిన పోలీసు శాఖ పరిస్థితిని తమదైన శైలిలో చక్కబెట్టింది.
డిచ్పల్లికి చెందిన ఓ బీజేపీ యువ మోర్చా కార్యకర్త ఏకంగా పాత వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల ద్వారా అరెస్టు చేయబడ్డాడు. కామారెడ్డిలో ఆమోదమే పొందని మాస్టర్ ప్లాన్‌పై రైతులను ఉసిగొల్పి నెల రోజుల పాటు రోడ్డుపైకి ఎక్కించి వారి జీవితాలతో బీజేపీ నేతలంతా ఆటాడుకున్నారు. నిబంధనల ప్రకారం వినతులు ఇవ్వకుండా, తమ అభ్యంతరాలు చెప్పకుండా కేవలం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు కుట్రలకు పాల్పడింది. ఇలా నిత్యం అవాస్తవాలను ప్రచారం చేస్తూ.. కుట్రలకు పాల్పడి బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారు. నిత్యం ఏదో ఒక చోట బీజేపీ చిల్లర చేష్టలతో రాష్ట్రంలో అశాంతిని సృష్టించే కుట్రలను ఢిల్లీ పెద్దలే చేయిస్తున్నట్లుగా పలువురు మేధావులు, రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బాధ్యత గల ప్రభుత్వం..
దేశంలోనే తెలంగాణ అనేక రంగాల్లో పురోగమిస్తున్నది. అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నది. ఇది కేంద్రంలోని బీజేపీకి కంటగింపుగా మారింది. ఎలాగైనా రాష్ట్ర ప్రభుత్వంపై తమ ఆధిపత్యాన్ని చెలాయించాలన్న దురుద్దేశంతో అనేక ఆటంకాలను సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పాలనను అస్థిరపరిచే కుట్రలు కొనసాగిస్తున్నది. అదే సందర్భంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన వారికి ఒక ఆయుధంగా మారింది. టీఎస్పీఎస్సీ తొలి ఛైర్మన్ ఘంటా చక్రపాణి ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ ఐదేండ్ల పాటు తన పనితీరుతో దేశంలోనే అగ్రగామి సంస్థగా ముద్రను వేసుకున్నది. అనంతరం ఐఏఎస్ అధికారి జనార్దన్‌రెడ్డి కూడా సమర్ధవంతంగా పని చేస్తూ అన్ని రకాల పోటీ పరీక్షలకు నోటిఫికేషన్లు ఇస్తూ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు.
ఈక్రమంలో ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పుతో జరిగిన పేపర్ లీకేజీ ఘటన లక్షల మంది నిరుద్యోగ యువతను నిరాశలోకి నెట్టింది. ఏండ్ల తరబడి అర్ధాకలితో, అరకొర వసతులతో, ఆర్థిక ఇబ్బందులను భరిస్తూ, నిరంతరం లైబ్రరీ నాలుగు గోడల మధ్య పుస్తకాలతో పోటీ పడుతున్న యువతను ఈ ఘటన ఇబ్బందికి గురి చేసినప్పటికీ.. ఎవరికీ నష్టం జరుగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కానీ ఈ వ్యవహారాన్ని రాజకీయం చేసేందుకు రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, వైఎస్సార్టీపీ చేస్తున్న కుట్రలు అన్నీ ఇన్నీ కావు. వీరందరిలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏకంగా ఉద్యోగార్థుల ఆత్మైస్థెర్యం దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తూ లక్షలాది మంది యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు.
సూత్రధారి సంజయే..
పదో తరగతి పేపర్ లీక్ సూత్రధారి బండి సంజయే. కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే బీజేపీ ప్రధాన ఉద్దేశం. పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. లక్షల మంది పిల్లలు భవిష్యత్తుతో పాటు వారి తల్లిదండ్రులు ఎంత బాధపడుతారోనన్న కనీస బాధ్యత లేకుండా సంజయ్ ప్రవర్తించాడు. బండి వైఖరిపై బీజేపీ కార్యకర్తలు ఆలోచన చేయాలె.
– వేముల ప్రశాంత్‌రెడ్డి,మంత్రి
జీవితాలతో బీజేపీ చెలగాటం
తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ నిరుద్యోగ యువకులు, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. టీఎస్పీఎస్సీ, టెన్త్ పేపర్ల లీకేజీల వెనుక ఉన్నది బీజేపీ కార్యకర్తలే. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే దమ్ములేక రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే. యువత ఆ పార్టీల ఉచ్చులో పడి బలికావొద్దు
– బాజిరెడ్డి గోవర్ధన్,ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే
బీజేపీ నాయకులదే కీలక పాత్ర
టెన్త్, టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీలో బీజేపీ నాయకులది కీలక పాత్ర. విద్యార్థులు, యువకులను ఆగం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఎలాగైనా తెలంగాణలో కల్లోలం సృష్టించాలని కుట్ర చేస్తున్నారు. సంజయ్‌ను జీవితాంతం జైలులో పెట్టినా తప్పు లేదు.
– బిగాల గణేశ్‌గుప్తా, అర్బన్ ఎమ్మెల్యే