మోర్తాడ్, జూలై 2: పర్యావరణ పరిరక్షణకు పల్లెలు నడుం బిగించాయి. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించే దిశగా అడుగులు వేస్తున్నాయి. పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, పేపర్‌తో తయారు చేసిన టీ కప్పుల వాడకంపై నిషేధం విధిస్తున్నాయి. ఈ క్రమంలో ఒక్కో ఊరు మెల్లిమెల్లిగా ప్లాస్టిక్ ఫ్రీ విలేజ్‌గా రూపాంతరం చెందుతున్నాయి. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాయి. 2014లో మొదలైన ఈ నిశబ్ధ విప్లవం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్లో వేగంగా విస్తరిస్తున్నది.
ఏ శుభకార్యాలకు వెళ్లినా, ఎక్కడ అన్నదానాలు కొనసాగినా ప్రతిచోట ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల వా డకం కనిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా శుక్రవారం దేవీ చెట్ల వద్ద పూజల సందర్భంగా జనం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అక్కడే భోజనాలు చేస్తుంటారు. పూజలు జరిగిన మరుసటి రోజు అక్కడకు వెళ్లి చూస్తే ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులే దర్శనమిస్తాయి. వాడి పడేసే ప్లేట్లు, గ్లాసుల వినియోగానికి అలవాటు పడ్డ ప్రజల్లో ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై ఆలోచనలు మొదలయ్యాయి. ప్లాస్టిక్ నియంత్రణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఒకచోట మొదలైన ఆలోచన ఒక్కో గ్రామానికి విస్తరిస్తూ ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల స్థానంలో స్టీల్‌ప్లేట్లు, గ్లాసులు వాడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మిగతా గ్రామాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉండాలనే ఉద్యమానికి 2014లోనే బీజం పడింది. ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు వాడొద్దని కమ్మర్పల్లి మండల కేంద్రంలోని పాటి హనుమాన్ ఆలయ కమిటీ 2014 లోనే నిర్ణయం తీసుకున్నది. ప్లాస్టిక్ వాడకం వల్ల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన తరుణంలో ఆలయ కమిటీ ప్లాస్టిక్‌ను నిషేధించింది. ప్రతి శనివారం ఇక్కడ నిర్వహించే అన్నదానం కోసం ఇక్కడ దాతల సహకారంతో స్టీల్ గ్లాసులు, స్టీల్ ప్లేట్లు అందుబాటులో ఉంచింది. కమిటీ వద్ద ప్రస్తుతం 3 వేల ప్లేట్ల వరకు ఉంటాయి. ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమంలో ప్లాస్టిక్ వినియోగమే ఉండదు. కేవలం స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులను మాత్రమే వాడతారు. అంతేకాదు, గ్రామంలో జరిగే శుభకార్యాలకు, అన్నదానాలకు స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులను ఉచితంగానే ఇస్తారు. ఇక్కడ ఆరంభమైన ప్లాస్టిక్ ప్లేట్ల నిషేధం క్రమంగా ఒక్కో గ్రామానికి పాకింది. కమ్మర్పల్లి శుక్రవారం దేవీ ఆలయం వద్ద ప్లాస్టిక్‌ను గ్రామకమిటీ నిషేధించింది. ఇక్కడ కూడా దాతల సహకారంతో 1000 స్టీల్ ప్లేట్లు, 500 స్టీల్గ్లాసులను అందుబాటులో ఉంచారు.
నందిపేట్‌లో అమ్మనాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్పంచ్ లింగం 5 వేల స్టీల్ ప్లేట్లు, గ్లాసులు కొనుగోలు చేసి స్టీల్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఎక్కడ శుభకార్యం జరిగినా, ఇతర ఏ కార్యక్రమాలు జరిగినా ఇక్కడి నుంచి తీసుకెళ్లి వాడుకునేలా స్టీల్ ప్లేట్లు, గ్లాసులు అందుబాటులో ఉంచారు. నందిపేట్తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ప్లేట్లు, గ్లాసులు తీసుకెళ్తుంటారు. ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామంలో జీపీ పాలకవర్గం ఆధ్వర్యంలో 500 స్టీల్ ప్లేట్లు, 250 స్టీల్గ్లాసులు అందుబాటులో ఉంచారు.
భీమ్‌గల్ మండలంలోని పిప్రి గ్రామంలోనూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు. హోటళ్లలో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు వాడితే రూ.5 వేలు జరిమానా విధిస్తామని, పట్టించిన వారికి రూ.వేయి నజరానా ప్రకటిస్తూ ఏకంగా బ్యానర్లను ఏర్పాటు చేశారు. మెండోరాలోని రెండు దుకాణాల్లో స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో స్టీల్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. కుప్కల్ గ్రామంలో జీపీ, దాతల సహకారంతో 500 స్టీల్ ప్లేట్లను అందుబాటులో ఉంచారు. మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామంలోనూ స్టీల్ ప్లేట్లు, గ్లాసులు వినియోగంలోకి తీసుకొచ్చారు. ప్లాస్టిక్ నిషేధిస్తూ హాసాకొత్తూర్, కమ్మర్పల్లి, మెండోరా తదితర గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ఇదే స్ఫూర్తి అన్ని గ్రామాల్లో కొనసాగితే ప్లాస్టిక్ నిషేధం ఉద్యమంలా ముందుకు సాగే అవకాశం ఉంది.
గ్రామంలోని శుక్రవారం చెట్టు వద్ద ప్రతి శుక్రవారం భక్తులు పూజలు చేస్తారు. అయితే, భోజనాల కోసం ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు విరివిగా వినియోగిస్తున్నారు. వాడిన వాటిని అక్కడే పడేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూముల్లోకి ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు కొట్టుకుని వెళ్తుండడం ఇబ్బందికరంగా మారింది. అదే సమయంలో ప్లాస్టిక్ వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తడం, పర్యావరణానికి కూడా విఘాతం కలుగుతుండడంతో ఏదైనా చేయాలని భావించాం. ప్రజారోగ్యంతో పాటు పర్యావరణ పరిక్షణ కోసం శుక్రవారం చెట్టు వద్ద ప్లాస్టి వాడకాన్ని నిషేధించాం. దాతల సహకారంతో స్టీల్ ప్లేట్లు, గ్లాసులను అందుబాటులో ఉంచాం.
– సుభాష్‌గౌడ్, వీడీసీ అధ్యక్షుడు, కమ్మర్పల్లి