ఖలీల్‌వాడి, జూలై 18 : మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గూండాల దాడి హేయమైన చర్య అని రూరల్ మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి వేముల ఇంటిపై దాడి గర్హనీయమని, ఇలాంటి దాడులు మళ్లీ చేస్తే తిప్పి కొడుతామని హెచ్చరించారు.
పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ చోటుచేసుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రౌడీల రాజ్యం నడుస్తున్నదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరు గ్యారెంటీలను గాలికి వదిలేసి, బీఆర్ఎస్పై పడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఒక్క పథకాన్ని కూడా పూర్తిగా అమలుచేయడంలేదని, సగం పనులు చేస్తూ అడిగిన వారిపై క్రిమినల్ కేసులు, ఇండ్లపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. దీనిని తాము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, బీఆర్ఎస్ దీన్ని తిప్పి కొడుతుందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడొద్దని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాబోవు రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, రూరల్ నియోజకవర్గ పార్టీ నాయకులు పాల్గొన్నారు.