కొంతకాలంగా జిల్లాలో కుక్కల బెడద తీవ్రంగా మారింది. ఏ గ్రామంలో చూసినా కుక్కల దాడుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మనిషి కనిపిస్తే చాలు వెంటపడుతున్నాయి. దీంతో బయటికి వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో ఓ బాలుడిని కుక్క కరవడంతో టీటీ తీసుకున్నాడు. ఇన్ఫెక్షన్ రావడంతో మళ్లీ దవాఖానకు వెళ్లి చికిత్స తీసుకున్నాడు. ముఖ్యంగా చిన్నపిల్లలపై కుక్కల దాడులు ఆందోళన కలిగిస్తున్నది. జిల్లా వ్యాప్తంగా కుక్కల బెడద తీవ్రంగా ఉన్నా అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
-ఖలీల్‌వాడి, సెప్టెంబర్ 19
నిజామాబాద్ జిల్లాలో కుక్క కాటు కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. 2023లో 4, 416 , 2024లో 4,151 మందికి , 2025లో ఇప్పటివరకు 2,939 మంది కుక్కకాటుకు గురయ్యారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కుక్కల దాడులకు బలవుతున్నారు. రాత్రయితే చెప్పనక్కర్లేదు. వీధులు, ప్రధానరోడ్లపై గుంపులు గుంపులుగా సంచరిస్తూ మనిషి కనిపిస్తే చాలు వెంటపడుతున్నాయి. ద్విచక్రవాహనదారులనూ వదలడంలేదు. దీంతో రాత్రివేళ బయటికి వెళ్లాలంటే భయపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిత్యం ఏదో ఒకచోట కుక్కల దాడి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో కూడా కుక్క కాటు కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. కుక్కల బెడదను నివారించాలని కార్పొరేషన్ అధికారులకు విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవు. కలెక్టర్ ఫిర్యాదు చేసినా ఫలితంలేకపోగా..అధికారులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు.
వర్షాకాలం వచ్చిదంటే చాలు పాము లు బయటికి వస్తాయి. ముఖ్యంగా అన్నదాతలు చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. వారు ఎక్కువగా క్షేత్రస్థాయిలో ఉండడంతో పాముల నుంచి ముప్పు పొంచి ఉంటుంది. ప్రతి సంవత్సరం పాముకాటుతో మృతిచెందిన ఘటనలూ ఉన్నాయి. ఇందులో ఎక్కువగా రైతులు, వ్యవసాయ కూలీలు ఉంటున్నారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించాల్సిన అధికారులు పట్టించుకోవడంలేదు. ఈ ఏడాది పాముకాటుతో మృతిచెందిన వారి వివరాలు అధికారుల వద్ద లేకపోవడం గమనార్హం.
ఎంతమంది పాము కాటుకు గురయ్యారనే వివరాలు చెబుతున్న అధికారులు.. ఎంతమంది మరణిస్తున్నారనే విషయం చెప్పలేకపోతున్నారు. గతేడాది మాక్లూర్‌లో ఓ బాలిక పాము కాటుకు గురై మృత్యువాత పడగా..ఈ విషయాన్ని అధికారులు చెప్పడంలేదు. మోపాల్ మండలం కులాస్‌పూర్‌లో ఓ బాలిక పాముకాటుతో మృతిచెందగా ఈ ఘటనపై అధికారులు నిర్లక్ష్యం వహించారు. జిల్లా వ్యాప్తగా 2023లో 47 మంది, 2024లో 25 మంది పాముకాటుకు బలికాగా..జీరో మరణాలను చెబుతుండడం గమనార్హం. 2025లో ఇప్పటి వరకు మంది మంది పాముకాటుకు గురయ్యారనే సమాచారం తమ వద్దలేదని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలోని అన్ని పీహెచ్సీ, సీహెచ్‌సీల్లో కుక్క, పాము కాటుకు మందులు అందుబాటులో ఉన్నా యి. ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. పాము కాటు వేసిన వెంటనే ప్రథమ చికిత్స చేయడానికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాం. అత్యవసర సమయంలో బాధితులను దవాఖానకు తీసుకెళ్లాలి.
-రాజశ్రీ, నిజామాబాద్ డీఎంహెచ్‌వో