కోటగిరి, సెప్టెంబర్ 2: అంగన్వాడీ కేంద్రాల్లో ఉండే చిన్నారుల పోషణ లోపంపై అవగాహన కల్పించడం, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం, కేంద్రాల ఆవరణలో పెరటి తోటల పెంపకం తదితర కార్యక్రమాలను అంగన్వాడీ టీచర్లు పోషణ మాసోత్సవాల్లో భాగంగా పకడ్బం దీగా అమలు చేస్తున్నారు. జిల్లాలో ఈ నెల 1వ తేదీ నుంచి 30 వరకు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పోషణ మాసంలో భాగంగా తల్లిపాలు, పరిపూర్ణమైన ఆహారంపై ప్రజలకు అవగాహన, అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఆరోగ్యకరమైన పోటీలు, ప్రత్యేక చర్చలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. అంగన్వాడీ సిబ్బంది, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలతో పోషణ పంచాయతీ కమిటీలు సమావేశం ఏర్పాటు చేసి పోషణ లోపం, ఆరోగ్యంపై ర్యాలీలు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు.
పోషణ లోపం గుర్తించడమిలా..
అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ లోపం గుర్తించేందుకు మొదట పిల్లల బరువును తూకం వేయాలి. ముందుగానే కేంద్రాల్లో బరువు తూచే యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలి. సాల్టర్ స్కేల్(బరువు తూచే యంత్రం) ఇన్ఫాంటో మీటర్ (శిశువుల పొడవును కొలిచే యంత్రం), స్టాడియో మీటర్(పిల్లల ఎత్తు కొలిచే యంత్రం), కిశోర బాలికలు, గర్భిణుల బరువు తూచే పరికరాన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సిద్ధంగా ఉంచుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవడంతో పెరుగుదల మెరుగువుతుంది. ఈ క్రమంలో మంచి ఆహారాన్ని పిల్లలకు ఇవ్వాలి. పిల్లల జబ్బ చుట్టు కొలత చూడడం ద్వారా పోషణ లోపాన్ని గుర్తించవచ్చు. 12.5 సెంటీమీటర్లు ఆపైన జబ్బ చుట్టుకొలత ఉన్నట్లయితే పోషణ లోపం లేనట్లుగా గుర్తించాలి. 12.4 సెంటీమీటర్ల నుంచి 11.5 సెంటీమీటర్లు చుటు ్టకొలత ఉంటే పోషణ లోపం ఉన్నట్లు గుర్తించాలి. 11.5 సెంటీమీటర్ల కన్నా తక్కువ చుట్టుకొలత ఉంటే అతి తీవ్ర లోప పోషణ ఉన్నట్లు గుర్తించాలి.
సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం
పిల్లల్లో పోషణ లోపం తో ఏర్పడే సమస్యలను గుర్తించి వారికి అవసరమైన ప్రొటీన్లను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతి ఏడాది పోషణ మాసం నిర్వహిస్తున్నది. సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం. షెడ్యూల్ ప్రకారం అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసం వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. దీనిపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా అంగన్వాడీ టీచర్లకు, ఏఎన్ఎంలకు సూచనలు చేశాం. ప్రతి కేంద్రంలో పిల్లల ఎత్తు, బరువులను తూచే పరికరాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
-రసూల్ బీ, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి, నిజామాబాద్
అవగాహన కల్పిస్తున్నాం..
అంగన్వాడీ సెంటర్ పరిధిలోని తల్లులు, గర్భిణులకు పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నాం. ఆకు కూరలు, కాయగూరలు, పండ్లు, పచ్చి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఈ నెల 1 నుంచి 30 వరకు అంగన్వాడీ కేంద్రాల్లో పోషక మాసోత్సవాలు నిర్వహిస్తాం. దీని ద్వారా గర్భిణులు, బాలింతలు ఏ రకమైన పౌష్టికాహారం తీసుకోవాలనే విషయాలపై అవగాహన కల్పిస్తాం.
– జె. సుమలత, సూపర్వైజర్, పొతంగల్ మండలం
ప్రాముఖ్యతను వివరిస్తున్నాం..
అంగన్వాడీ కేంద్రాల్లో ఈ నెల 1 నుంచి పోషణ మాసోత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అంగన్వాడీ టీచర్లు తమ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, పిల్లలు, కిశోర బాలికలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్నారు.
-జానకీ, సీడీపీవో, బోధన్ ప్రాజెక్ట్