మాక్లూర్, డిసెంబర్ 15: మండలంలోని మానిక్‌బండార్ గ్రామ శివారు మానికబండార్ తండాకు చెందిన శ్మశానవాటికలో గురువారం రాత్రి క్షుద్రపూజల కలకలం రేపింది. శ్మశాన వాటికలో అమ్రాద్ గ్రామానికి చెందిన లక్కపాటి అరవింద్,ఆర్మూర్‌కు చెందిన కొందరు వ్యక్తులతో కలిసి క్షుద్రపూజలు చేస్తుండగా..విషయం తెలుసుకున్న తండావాసులు అక్కడికి చేరుకొని వారిపై దాడి చేశారు. దీనిపై సమాచారం అందుకున్న మాక్లూర్ ఏఎస్సై గంగాధర్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. గాయపడినవారిని పోలీసు స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా తండావాసులు అడ్డుకొన్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఏఎస్సై గంగాధర్ కన్ను, తలకు గాయాలయ్యాయి.
దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నార్త్ రూరల్ సీఐ నరహరి, సౌత్ రూరల్ సీఐ వెంకటనారాయణ, రూరల్ సీఐ సతీశ్ బలగాలతో అక్కడికి చేరుకొన్నారు. ఏఎస్సైతోపాటు గాయపడిన వారిని దవాఖానకు తరలిస్తుండగా.. తండావాసులు అడ్డుకొన్నారు. తమ గ్రామ శ్మశాన వాటికలో అరవింద్ క్షుద్రపూజలు తరచూ చేస్తున్నాడని, దీంతో తండాకు చెందిన 15 మంది చనిపోయారని, మరికొందరు అనా రోగ్యంతో బాధపడుతున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో తండావాసులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయగా.. తండావాసుల్లో కొందరికి గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శుక్రవారం పోలీసు బలగాలను మోహరించారు.