కాంగ్రెస్ పార్టీ బరితెగించింది. కత్తిపోట్లు, దాడులతో హింసాత్మక రాజకీయాలకు తెరలేపింది. మొన్న ఎల్లారెడ్డిలో ఏకంగా హస్తం పార్టీ గ్రామ అధ్యక్షుడే ముగ్గురు బీఆర్ఎస్ కార్యకర్తలపై కత్తితో దాడికి దిగాడు. ఇది మరువక ముందే తాజాగా బోధన్‌లో ఏకంగా ఎమ్మెల్యే షకీల్‌తో పాటు అనుచరులపైనా కాంగ్రెస్ నేతలు దాడికి తెగబడ్డారు. వారికి బీజేపీ కార్యకర్తలు తోడవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో బీఆర్ఎస్కు చెందిన పలువురు గాయపడ్డారు. పోలీసులు వచ్చి లాఠీచార్జి చేయడంతో ఉద్రిక్తత చల్లారింది. పోలీసులు రాకపోతే తనను ఖతం చేసేవారని షకీల్ ఆందోళన వ్యక్తం చేశారు.
బోధన్, నవంబర్ 22: కాంగ్రెస్ మరోసారి అరాచకానికి దిగింది. బుధవారం ఎన్నికల ప్రచారం చేస్తున్న బోధన్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే మహ్మ ద్ షకీల్‌పై ఏకంగా కాంగ్రె స్ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఇందుకు బీజేపీ నాయకులు కూడా తోడయ్యారు. అంతకుముందు బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కార్యకర్తలపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు దాడులుచేసి గాయపర్చారు. ఈ ఘటన ఎడపల్లి మండలంలోని సాటాపూర్ గేట్ వద్ద జరిగింది. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. రణరంగంగా మారిన సాటాపూర్ గేట్ వద్ద పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసు లు ఒక దశలో లాఠీచార్జి చేశారు. అంతకు ముందు సైతం షకీల్ ప్రచారాన్ని ఏఆర్పీ క్యాంప్, బ్రహ్మణ్‌పల్లి, జైతాపూర్ గ్రామాల్లో అడ్డుకునేందుకు కాంగ్రె స్, బీజేపీ కార్యకర్తలు గొడవలు చేశారు. జైతాపూర్ లో బీఆర్ఎస్ ఎడపల్లి మండల అధ్యక్షుడు డి.శ్రీరామ్‌పై ఆ గ్రామ కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. ఆయా గ్రామాల్లో గొడవలు సృష్టించిన కాంగ్రెస్ నాయకులు, కొందరు బీజేపీ నాయకులు సాటాపూర్ గేట్ వద్దకు చేరుకొని పథకం ప్రకారం అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడి చేసి పలువురిని తీవ్రంగా గాయపర్చారు. ఈలోగా అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే షకీల్ వాహనంపైనా దాడి జరిగింది. తనపై రాళ్లు, రాడ్లు, కత్తులతో కాంగ్రెస్ నాయకులు, గుండాలు దాడికి వచ్చారంటూ, తనను హత్య చేసేందుకు కుట్ర జరిగిందని షకీల్ పోలీసులకు ఫిర్యాదు చేశా రు. కాంగ్రెస్ గూండాల దాడిలో ఎడపల్లి ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఎడపల్లి వైస్ ఎంపీపీ ఇమ్రాన్ ఖాన్, ఎడపల్లికి చెందిన మోసీన్, మెహబూబ్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని బోధన్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
బోధన్‌లోని తన నివాసానికి చేరుకున్న షకీల్ విలేకరుల సమావేశంలో దాడి వివరాలను చెప్పా రు. తనను ఒక పథకం ప్రకారం ఖతం చేయడానికి కాంగ్రెస్ నాయకులు కుట్ర పన్నారని, అదృష్టవశాత్తు ఆ కుట్ర నుంచి బయటపడ్డానని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి ఓడిపోతున్నట్లు తెలిసిపోయిందని, దీంతో నిరాశ, నిస్పృహలతో తనపై, తన అనుచరులపైనా విచక్షణారహితంగా దాడులకు ఉసిగొల్పారని విమర్శించారు. కాంగ్రెస్ నా యకుడు శరత్‌రెడ్డి ఈ దాడికి సూత్రధారి అని అన్నా రు. శరత్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు, కాం గ్రెస్ నాయకుడు శ్రీనివాస్, జైతాపూర్ సర్పంచ్ రామగోపాల్‌రెడ్డి, ఆ గ్రామానికి చెందిన నారాయణ, బోధన్‌కు చెందిన కౌన్సిలర్ మీర్ నజీర్ అలీ ఈ దాడులకు పాల్పడ్డారన్నారు. తాను సాటాపూర్ గేట్‌కు వచ్చేసరికి తమ కార్యకర్తలను, ముఖ్యంగా ముస్లిం యువకులను ఒక గదిలో బంధించి కాంగ్రె స్ నాయకులు కొట్టారన్నారు. బీజేపీ నాయకుడు కూరెళ్ల శ్రీధర్ కూడా దాడికి పాల్పడ్డవారిలో ఉన్నాడన్నారు. తనపై జరిగిన హత్యాయత్నంపై పోలీసులకు ఫిర్యాదుచేశానని షకీల్ తెలిపారు. పోలీసులు తక్షణం నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌చేశారు.
బోధన్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను షకీల్ పరామర్శించారు. ఆయన వెంట డీసీసీబీ డైరెక్టర్లు గిర్దావర్ గంగారెడ్డి, గింజుపల్లి శరత్, బీఆర్ఎస్ నాయకులు బుద్దె రాజేశ్వర్, డి.శ్రీరామ్, రవీందర్ యాదవ్, బోధన్ ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వరరావు దేశాయ్ ఉన్నారు. కాంగ్రె స్ నాయకులు చేసిన దాడి విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బోధన్ దవాఖాన వద్దకు తరలివచ్చారు. ‘సుదర్శన్‌రెడ్డి డౌన్ డౌన్’, కాంగ్రెస్ నాయకులను కఠినంగా శిక్షించాలి అంటూ నినాదాలు చేశారు. వారితో పాటు షకీల్ కూడా నినాదాలు చేశారు.
బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్ అధికారికంగా అనుమతులు పొంది ఎడపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేస్తుండగా, కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యపూరితంగా ఆయనపైనా, బీఆర్ఎస్ కార్యకర్తలపైనా దాడిచేశారని బోధన్ ఏసీపీ కిరణ్‌కుమార్ అన్నారు. బ్రాహ్మణ్‌పల్లి, జైతాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కార్యకర్తలపైన దాడులు చేసినవారిని గుర్తించి, వారిపై కేసులు నమోదు చేస్తామని ఏసీపీ తెలిపారు.