నందిపేట, మే 26 : రైతుల కష్టాలపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను గాలికొదిలేయడంతో రైతులు ఆగమాగమవుతున్నారని పేర్కొన్నారు. రైతులు కన్నీరుమున్నీరవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్తంతా కూడా కనికరం కూడా లేకుండా పోయిందని విమర్శించారు. యాసంగి పోయి వానకాలం వచ్చినా ధాన్యం కొనే దిక్కు లేదని పేర్కొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని పేర్కొన్నారు.
పంట చేతికొచ్చే సమయంలో వడగండ్ల వానలు రైతులను నట్టేట ముంచాయని తెలిపారు. మామిడి పంటలు, కూరగాయలు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పంట కండ్ల ముందే నీటి పాలుకావడంతో రైతు కంట కన్నీరు కారుతున్నదన్నారు. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. 70 శాతం వరకు వడ్లు రాలిపోయిన పరిస్థితి నెలకొన్నదని, మరోపక్క కోసిన పంట కల్లాల్లో నీటిలో మునిగిపోయిందని పేర్కొన్నారు.
పంట పొలాలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. సిరికొండ, ధర్పల్లి, జక్రాన్‌పల్లి, వేల్పూర్, ఆర్మూర్, నందిపేట్, డిచ్పల్లి, భీమ్‌గల్, కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, దోమకొండ, భిక్కనూరు, నాగిరెడ్డిపేట్, బాన్సువాడ, జుక్కల్, పిట్లం, నిజాంసాగర్ తదితర మండలాల్లో భారీ వర్షం కురియడంతో పంటలు పూర్తిగా గింజ రాలిపోయిందని, దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు.
ఎక్కడా కొనుగోలు కేంద్రాలు కనిపించడం లేదని, గన్నీ బ్యాగులకు దిక్కులేదని, ధాన్యం తరలించడానికి లారీలు లేవని తెలిపారు. అధికారులు ముఖం చాటేశారని, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదని పేర్కొన్నారు. 45 రోజులు అయినా కొనుగోళ్లు పూర్తి కాకపోవడం సిగ్గుచేటన్నారు. అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని, అందాల పోటీల కోసం పదిసార్లు రివ్యూ చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పదేండ్ల పాలన రైతులకు స్వర్ణయుగమని అభివర్ణించారు.