బోనాల జాతర షురూ..
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల జాతర ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రారంభమైంది. అన్ని గ్రామాలు, పట్టణాల్లోని ఆలయాలను ఆలయ కమిటీ, గ్రామస్తులు సిద్ధం చేశారు.
- ఊరూరా పండుగ వాతావరణం
- గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు
- ముస్తాబైన ఆలయాలు
- ప్రారంభం కానున్న వన భోజనాలు
- శ్రావణ మాసం వరకు సందడే సందడి
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 1: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల జాతర ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రారంభమైంది. అన్ని గ్రామాలు, పట్టణాల్లోని ఆలయాలను ఆలయ కమిటీ, గ్రామస్తులు సిద్ధం చేశారు. ఆషాఢం అంటేనే బోనాల సీజన్… పల్లెల్లో అయితే ఇంటింటా పండుగే. గంగమ్మ, పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ బోనాలతో పల్లె, పట్నం అనే తేడాలేకుండా ప్రతి చోటా బోనాన్ని ఎత్తుకుంటున్నారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలతో జిల్లా ప్రజలు బోనాల్లో మునిగి తేలుతున్నారు.
ఊరూరా జాతర…
ఆషాఢం నుంచి శ్రావణ మాసందాకా గ్రామాలు, పట్టణాల్లో బోనాల జాతర కొనసాగనున్నది. ఏ గ్రామంలో చూసినా పచ్చని మామిడి తోరణాలు, రంగుల సున్నాలతో అలంకరించిన ఇంటి పరిసరాలు, బంధువుల రాకతో ఇండ్లు కళకళలాడుతాయి. ఆదివారం, గురువారం రోజుల్లో బోనాలను తీస్తారు. రెండురోజులు అమ్మవారికి ఇష్టమైన రోజులు. కొన్ని ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో పండుగను నిర్వహిస్తారు. అమ్మవారికి బోనాలను సమర్పించే సమయంలో గ్రామానికి సంబంధించిన భవిష్యవాణిని వినిపిస్తారు. ఊరు శివారులో ఉన్న ఆలయాలు, అటవీ ప్రాంతాల్లో సంబురాలు చేసుకొని వంటలు వండుకుని విందు భోజనాలు చేస్తారు.
బోనాల నేపథ్యం …
బోనం అంటే భోజనం…ఆహారం అని అర్థం. విస్తారంగా వర్షాలు కురిపించి పంటలు పండేలా కరుణించి ఇంటిల్లిపాదికీ కడుపునిండేలా చూడాలని గ్రామదేవతలకు కృతజ్ఞతగా భోజనం పెట్టడమే బోనం. అన్నం ప్రసాదిస్తున్న అమ్మకు నైవేద్యం పేరుతో భక్తులు చేసే వేడుకే బోనాల ఉత్సవం. ఇది తెలంగాణకు ప్రత్యేకం. కాకతీయుల కాలం నుంచి ఇక్కడి పల్లెల్లో బోనాలు తీయడం ఆనవాయితీగా వస్తున్నదని చరిత్రకారుల అభిప్రాయం. పూర్వం వానకాలంలో వానలు బాగా కురిసేవి. పారిశుద్ధ్యం లోపించి గ్రామాల్లో కలరా, ప్లేగు, తట్టు, మశూచి ఇతర రోగాలు వ్యాపించేవి. భయంకర వ్యాధులతో ప్రజలు అల్లాడేవారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని కాపాడమని కొలిచేవారు. పిల్లాపాపలను, గొడ్డూగోదను, పంటలతో పాటు ఊరు మొత్తానికి కాపలా కాయాలని మొక్కులు చెల్లించేవారు. ఊరంతా ఒకే రోజున పసుపు అన్నంతో బోనం చేసి అమ్మవారికి సమర్పించేవారు. మహిళలు కొత్త బట్టలు ధరించి బోనాలను తలపై పెట్టుకొని డప్పుచప్పుళ్ల్ల మధ్య ఊరేగింపుగా బయల్దేరి అమ్మవారికి నైవేద్యం పెట్టేవారు. దుష్టశక్తులను పారదోలాలని దున్నపోతులను బలిచ్చేవారు. ఇప్పుడు మేకలు, గొర్రెలు, కోళ్లను బలిస్తున్నారు.
గావు పట్టుడు….
గ్రామదేవతకు సోదరుడైన పోతరాజును ప్రతిబింబించే వ్యక్తి బోనాల పండుగను జరిపిస్తాడు. పోతరాజు పాత్రను పోషించే వ్యక్తి ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు, ఎర్రని ధోవతి ధరించి వేపాకులను నడుముకు చుట్టుకొని కొరడాతో విన్యాసాలు ప్రదర్శిస్తాడు. బోనంతో వచ్చే మహిళలను అమ్మవారి సమక్షానికి తీసుకెళ్తాడు. ఆలయం వద్దే తన దంతాలతో మేకపోతును కొరికి తలా మొండాన్ని వేరుచేసి అమ్మవారికి సమర్పిస్తాడు.
అమ్మ కరుణకోసం శాక..
అమ్మవారికి బోనంతోపాటు శాకను సమర్పిస్తారు. వివిధ ప్రాంతాల్లో వేర్వేరుగా శాకను తయారు చేస్తారు. చిన్న మట్టిపాత్రలో నీళ్లు పోసి చక్కెర లేదా బెల్లం వేసి తయారు చేస్తారు.అందులో వేపకొమ్మలు ఉంచి బోనంపై పెట్టుకొని ఆలయానికి చేరుకొని అమ్మవారికి సమర్పిస్తారు. కొన్ని చోట్ల కల్లుతో శాక చేసి గ్రామదేవతకు ముట్టజెబుతారు. తర్వాత ఇంటిల్లిపాదీ తీర్థంలా తీసుకుంటారు.
మట్టి పాత్రలో నైవేద్యం…
గ్రామ దేవతకు కొత్త మట్టిపాత్రతో నైవేద్యం (బోనం) సిద్ధం చేయాలి. ఇందుకోసం పండుగ రోజు తెల్లవారుజామునే మహిళలు భక్తిశ్రద్ధలతో కొత్త పాత్రలు తెచ్చి నైవేద్యం వండుతారు. కట్టెల పొయ్యిమీదే బోనం వండాలనే ఆచారం అనాదిగా ఉంది. వండిన తర్వాత కుండను శుభ్రం చేసి పసుపు, కుంకుమ, సున్నం, పువ్వులు, వేపకొమ్మలతో అలంకరించి దీపం వెలిగిస్తారు.
నవ దంపతులకు ఎడబాటు..
ఆషాఢంలో సాధారణంగా శుభకార్యాలు నిర్వహించరు. పూర్వీకులు దీన్ని శూన్యమాసంగా భావిస్తారు. ఇదే నెలలో కొత్త దంపతులను నెలపాటు వేర్వేరుగా ఉంచుతారు. ఈ నెలలో మహిళలు గర్భం ధరిస్తే ఏప్రిల్, మేలో ప్రసవం ఉంటుందని, అది ఎండాకాలం కావడంతో తల్లీబిడ్డల ఆరోగ్యానికి మంచిది కాదని కొత్త జంటను దూరంగా ఉంచే సంప్రదాయం ఆనాదిగా వస్తున్నది.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

