కోటగిరి, జూలై 30: న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి వెళ్లకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పంచాయతీ కార్మికులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఇండ్లలో నిర్బంధించడంతో పాటు ఊరు దాటి వెళ్లొద్దంటూ కొందరికి నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ తరలి వెళ్లకుంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని కోటగిరి, చందూరు, మోస్రా, బాన్సువాడ, రాజంపేట్ తదితర మండలాల్లోని కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు.
కోటగిరి మండల పంచాయతీ కార్మికుల సంఘం అధ్యక్షురాలు రాజేశ్వరికి ఇంటికి సోమవారం రాత్రి చేరుకున్న పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ధర్నాకు వెళ్లొద్దని, గ్రామం దాటొద్దని ఆదేశించినట్లు ఆమె వాపోయారు. డిమాండ్ల సాధన కోసం తాము శాంతియుతంగా ఆందోళన చేద్దామనుకుంటే అడ్డుకోవడం సరికాదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, డిమాండ్ల సాధన కోసం చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తలపెట్టిన ఆశ కార్యకర్తలను బాన్సువాడ పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆశ కార్యకర్తలు ఠాణా ఎదుట నిరసన తెలిపారు.