ఆర్మూర్‌టౌన్, అక్టోబర్7: తెలంగాణ పండుగలపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం ఏర్పడ్డాక మన పండుగలకు తొలి ప్రాధాన్యత ఇచ్చి, అన్ని మతాల వారిని గౌరవించారని తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా ప్రతి ఏటా దసరాకు ముం దు బతుకమ్మ చీరలను ప్రతి ఇంటికీ పంపిణీ చేశారని గుర్తుచేశారు.
ముస్లింలు, క్రైస్తవుల పండుగలకు కూడా వారికి దుస్తులను పంపిణీ చేసి, పండుగలను అధికారికంగా నిర్వహించారని తెలిపారు. స్వరాష్ట్రంలో ప్రతి పండుగనూ బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్వహించిందని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పండుగలను కనుమరుగు చేస్తోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే రేవంత్ సర్కారు ఆరు గ్యారెంటీలు అంటూ ఉన్న భరోసాలను తొలగించిందని ఎద్దేవా చేశారు.
ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలకు బీఆర్ఎస్ హయాంలో పదేండ్లు సుమారు 13లక్షల చీరలను ఆడబిడ్డలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ పండుగలపై వివక్ష చూపవద్దని సూచించారు. లేదంటే తెలంగాణ ప్రజలు హైడ్రా కన్నా ఎక్కువ భూస్థాపితం చేస్తారని సోమవారం ప్రకటనలో హెచ్చరించారు.