కంఠేశ్వర్, ఏప్రిల్ 9 : ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 13 నుంచి 18 వరకు చేపట్టనున్న అరైవ్ – అలైవ్ కార్యక్రమాలను జిల్లాలో విస్తృత స్థాయిలో నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య సూచించారు. ఈ కార్యక్రమం అమలు తీరుపై రాష్ట్ర సచివాలయం నుంచి గురువారం సా యంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు.
దేశవ్యాప్తంగానే కాకుండా రాష్ట్రంలోనూ రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటి నియంత్రణ కోసం ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాల్సిన ఆవశ్యకతను తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలుగా ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించేలా చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికపై వివరించారు.
వీసీ అనంతరం కలెక్టర్, సీపీ ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించేందుకు వీలుగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాల్సిన గురుతర బాధ్యత అధికారులపై ఉన్నదని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. వార్డు సభ్యులు, సర్పంచులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సహా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను అన్ని వర్గాల వారినీ భాగస్వాములు చేయాలని ఆదేశించారు. 13న అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచుల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు.
రిటైర్డ్ టీచర్లు, డాక్టర్లు, అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, యువజన సంఘాల ప్రతినిధులతో రోడ్డు సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, ఈ కమిటీలో కనీసం ముగ్గురు మహిళలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలన్నారు. రహవీర్ కింద 17న శిక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 18న ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తిస్తూ వారికి కౌన్సెలింగ్ చేయాలని సూచించారు. 16న మండల స్థాయిలో నిర్వహించే ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికల్లోనూ రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రధాన కూడళ్లలో మానవహారాలు నిర్మించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దిలీప్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.