నిజామాబాద్ క్రైం, జనవరి7 : నిజామాబాద్ జిల్లా కేంద్రాన్ని అడ్డాగా చేసుకొని మట్కా(జూదం)ను జోరుగా సాగించి కోట్ల రూపాయల లావాదేవీలు సాగించిన నిర్వాహకుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకాలం పోలీసులకు ఏమాత్రం అనుమానం కలగకుండా మట్కా నిర్వాహకుడు తన అనుచరగణంతో తెలంగాణతో పాటు మహారాష్ట్ర ప్రాంతాల్లో జోరుగా మట్కా నిర్వహించాడు. అంతే కాకుండా ఎంతో మంది యువతకు డబ్బుల ఆశ చూపించి వారిని మట్కా రొంపిలోకి లాగడమే కాకుండా పలువురు ఏజెంట్ల నుంచి కోట్లాది రూపాయలు దండుకొని వారికి ఎగనామం సైతం పెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిజామాబాద్ టాస్క్‌ఫోర్స్, నిజామాబాద్ ఏసీపీలు రాజశేఖర్ రాజు, కిరణ్ కుమార్ ఆదివారం వివరాలను వెల్లడించారు. నిజామాబాద్ నగరానికి చెందిన మహ్మద్ జమీర్ మట్కా ఏజెంట్లు, అనుచరుల ద్వారా అమాయక ప్రజలను మట్కా వ్యసనంలోకి దింపి వారికి డబ్బుల ఆశ చూపించి కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టినట్లు తెలిపారు.
అంతే కాకుండా నిందితుడు మహారాష్ట్రలోని నాందేడ్, ధర్మాబాద్, బిలోలి, వర్ధ, అకోలా, అమరావతి తదితర అనేక ప్రాంతాల్లో మాట్కా నిర్వాహకులతో సంబంధాలు పెట్టుకొని ప్రతి రోజు విజేతలుగా రాబోయే నంబర్లను తీసుకొని వాటిపై ఏజెంట్లు, బుకీల ద్వారా భారీ ఎత్తున బెట్టింగ్ పెట్టి కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహించినట్లు విచారణలో తేలిందన్నారు. జమీర్‌ను ఆదివారం అరెస్టు చేసి,రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. జమీర్ అనుచరుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. దీంతో పాటు జమీర్ కూడ బెట్టిన ఆస్తుల వివరాలు సైతం సేకరించడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. జిల్లా ప్రజలు మట్కా ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని సీపీ కల్మేశ్వర్ సూచించారు. అంతర్రాష్ట్ర మట్కా నిర్వాహకుడిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్, పోలీసు సిబ్బందిని సీపీ అభినందించి, వారికి రివార్డులు ప్రకటించారు.