ఆర్మూర్, ఆగస్టు 13 : ఆర్మూర్‌లో అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని వసంతజ్యోతి దవాఖాన నుంచి కుక్కల గుట్ట మీదుగా ఎంఆర్ గార్డెన్ వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను ఆదివారం పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించారు. జీవన్‌రెడ్డి కాసేపు రోడ్డు రోలర్‌ను నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమైక్యపాలనలో ఆర్మూర్ అభివృద్ధికి నోచుకోలేదని, ప్రస్తుతం పట్టణంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు.
ఆర్మూర్‌లో ఏ వీధికి వెళ్లినా బీటీ, సీసీ రోడ్లు కనిపిస్తున్నాయన్నారు. పట్టణ అభివృద్ధికి మరో రూ.30 కోట్ల నిధులు మంజూరయ్యాయని, పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రజలంతా కేసీఆర్ వైపే ఉన్నారని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనను సైతం భారీ మెజార్టీతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కాలనీవాసులు జీవన్‌రెడ్డిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ షేక్ మున్నా, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పండిత్ ప్రేమ్, పోల సుధాకర్, జనార్దన్‌గౌడ్, సుంకరి రవి, అయ్యప్ప, శ్రీనివాస్, నవీన్, జంగం అశోక్ పాల్గొన్నారు.