రుద్రూర్, మే 30: రుద్రూర్ శాస్త్రవేత్తలు విత్తన పరిశోధనలో మరో ముందడుగు వే శారు. చెరుకు, వరిలో నూతన వంగడాలను కనుగొన్నారని కృషి విజ్ఞాన కేంద్రం, వరి-చెరుకు పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ అంజయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని వరి చెరుకు పరిశోధనా స్థానంలో శాస్త్రవేత్తలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. శాస్త్రవేత్తలు మూడు నూతన వంగడాలను రైతులు ముందుకు తీసుకొచ్చి అద్భుత విజయాన్ని సాధించారని అన్నారు.
మారుతున్న కాలానికనుగుణంగా నూతన వంగడాలను కనుగొని, ఎప్పటికప్పుడు రైతులకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. తెగుళ్ల నుంచి తట్టుకునే నూతన చెరుకు రకాన్ని (ఆర్డీఆర్ 81) రైతులకు అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. ఈ రకం చెరుకు సాగునీరు అం దుబాటులో ఉన్న ప్రాంతాలకు అనుకూలమని పేర్కొన్నారు. ఎర్రకుళ్లు, కొరడా తెగులు, పసుపు ఆకు తెగులుని తట్టుకుంటుందని వివరించారు. అంతేకాకుండా పీక పురుగు, కాండం తొలుచు పురుగు, పొలుసు పురుగును కూడా తట్టుకుంటుందని పేర్కొన్నారు.
వరిలో కూడా రెండు రకాల నూతన వంగడాలను రైతులకు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. జగిత్యాల్ సాంబ, నెల్లూరి మసూరి అనే రకాలను సంకరపరిచి ఆర్డీఆర్-1200 రకాన్ని కొనుగొన్నట్లు పేర్కొన్నారు. అధిక దిగుబడినిచ్చి, తెగుళ్ల నుంచి తట్టుకునే శక్తి కలిగిన వంగడాన్ని కనుగొన్నారని తెలిపారు. తక్కువ నూక శాతం కలిగి ఉండి నాణ్యతగా ఉంటుందని పేర్కొన్నారు.
రెండోది ఆర్డీఆర్1162 అనే స్వల్పకాలిక రకం 2024లో విడుదల చేసినట్లు తెలిపారు. ఈ రకం రెండు కాలాలకు అనువైనదని, వానకాలంలో120, యాసంగిలో130రోజుల్లో పంట చేతికి వస్తుందని పేర్కొన్నారు. ఈ రకాన్ని జేజీఎల్11727, జేజీఎల్17004 రకాలను సంకర పరిచి కొనుగొన్నట్లు వివరించారు. జూన్2న ప్రతి గ్రామంలో ముగ్గురు లేదా నలుగురు రైతులకు ఉచితంగా విత్తనాలను పంపిణీ చేస్తామని తెలిపారు. జూన్ 3న కేవీకే, వరి పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో విత్తన మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు.