ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో మ్యాగీ వంటకం ఆలస్యం.. 15 ఏండ్ల సంసారంలో చిచ్చు పెట్టింది. దీంతో ఈ 15 ఏండ్ల పాటు చేసిన తప్పులను భార్యాభర్తలు తవ్వుకుంటూ విడిపోయేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరు పిల్లలు ఉన్నా వారి మనస్సు కరగడం లేదు.
జూమ్ మీటింగ్‌కు ఆలస్యమవుతోంది…కొద్దిగా కూరగాయలు కొసిపెట్టండని అడిగితే భర్తకు కోపం వచ్చింది. నన్నే కూరగాయలు కొయ్యమంటావా…నాకన్నా ఎక్కువగా సంపాదిస్తున్నావనే అహంతో నన్ను ఈ పనులు చేయమంటావా…నాకు కూడా ఆఫీసు నుంచి మీటింగ్ ఉందంటూ భర్త తిట్ల పురాణం చదివాడు. అంతే పదేండ్ల సంసార జీవితంలో అలజడి రేపింది. పిల్లలను చూసినా వారి మనస్సు చలించడం లేదు.
పిల్లల స్కూల్‌కు సంబంధించిన పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు కావాలి….భార్య భర్తను కోరింది. మొన్ననే కదా ఫీజు కట్టింది. ఇప్పుడు సర్దుకోలేవా..నేను ఒక్కడినే సంపాదించాలి. కొద్దిగా ఓపిక పట్టు…తీసుకువస్తాను అని భర్త కొంచెం కోపంతో చెప్పాడు. చేతగానిది పెండ్లి ఎందుకు చేసుకున్నావు. పిల్లలను కన్నందుకు నీ బాధ్యత…అంటూ భార్య సమాధానం ఇవ్వడంతో 22 ఏండ్ల జీవితంలో కలకలం రేపింది.
6వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆన్లైన్ క్లాసులంటూ నిత్యం ఫోన్లో ఉండిపోయింది. ఫోన్‌ను తీసుకుంటే చాలు 11 ఏండ్ల విద్యార్థిని తల్లిపై కేకలు పెట్టింది. తినమంటే తినకుండా అలిగింది. దీంతో ఆ తల్లి మనస్సుకు గాయమైంది.
ఈ విధంగా విపరీతమైన కోపాలతో అన్ని వర్గాల్లోని కుటుంబాలు సతమతమవుతున్నాయి. ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకొని ఏండ్ల తరబడి నుంచి చేస్తున్న సంసార జీవితాన్ని తెంపేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీని కోసం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ పోలీసు స్టేషన్లకు ఎక్కుతున్నారు. చిన్నచిన్న విషయాలకు మనస్పర్థలను తెచ్చుకుని వాటిని పెద్దవి చేసుకుంటూ అనాలోచిత కోపాన్ని పెంచుకుంటున్నారు. ఎవరు చెప్పినా వినడం లేదు. సర్దుకుపోవాలనే ఆలోచనే లేదు. కోపాన్ని దిమాక్‌కు ఎక్కించుకొని భవిష్యత్తుపై ఎలాంటి ప్రణాళిక లేకుండా వేరుగా ఉంటామని భీష్మించుకుంటున్నారు. మానసికంగా కుంగిపోతున్నారు. అనవసర మనోవేదనకు గురవుతున్నారు. మనస్సును కకావికలం చేసుకుంటున్నారు.
సిటీబ్యూరో, జూలై 26(నమస్తే తెలంగాణ): కరోనా, లాక్డౌన్ సందర్భంలో నెలలు తరబడి ఇంట్లోనే ఉండడం, ఆ తర్వాత వర్క్‌ఫ్రం హోం పద్ధతి రావడంతో చాలా మంది ఉద్యోగస్తులైన భార్యాభర్తలు 24/7 ఎదురెదురు పడ్డారు. అంతకుముందు ఉద్యోగాలకు వెళ్లడంతో వారు చాలా తక్కువ గంటల పాటు ఇంట్లో ఫేస్ టూ ఫేస్‌గా ఉండేవారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య అన్యోన్యత బాగా ఉండేది. తాజాగా ఎక్కువసార్లు ఎదురుపడడం, ఇంట్లో పనిని షేర్ చేసుకోమనడం, వాట్సాప్ చాటింగ్‌లు, తదితర అంశాలకు సంబంధించిన వ్యవహారాల్ని కొత్తగా చూస్తుండడంతో విబేధాలు తలెత్తాయి. దీనికి తోడు కరోనా దెబ్బతో ఒకరి ఉద్యోగం పోవడం, మరొకరి వేతనంలో కోత పడడం, అప్పటి వరకు అనుభవించిన విలాసవంతం తగ్గడంతో చాలా మంది ఉద్యోగులు, వ్యాపారస్తులు, రోజువారీ వ్యాపారాలు, కూలీలు, ఇంకా అనేక వర్గాల ప్రజల్లో అసహనం రేపి ఓపికను చంపేసింది. దీంతో ఈ కష్టాలు, సందర్భాలను అధిగమించలేక ప్రేమానురాగాలతో ఏండ్ల తరబడి సంసారాలు చేసిన వారు కొట్టుకునే స్థాయికి వచ్చారు. ఇద్దరిలో సమన్వయం కొరవడి వాటిని అధిగమిద్దామని ఆలోచిం చకుండా నీవెంత…నీవెంత అంటూ దూరమయ్యేందుకు రెడీ అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ అసహనం మద్యానికి వ్యసనపరులుగా మారుస్తుండగా, మరికొందరు అనవసర గొడవలకు దిగుతు వారి పరిస్థితిని మరింతగా దిగజార్చుకుంటున్నారు. వాహనం నడిపే సమయంలో తెలియకుండా కోపాన్నికి గురై ఇతర వాహనదారులతో గొడవలకు దిగుతున్నారు.
యాంగ్రీ మేనేజ్మెంట్ అంటే..
ఇలా అసహనం, కోపం తలెత్తినప్పుడు మీకు మీరు ప్రశ్నించుకోండి. ఈ ప్రపంచంలో మిమ్మల్ని మీరే సరిగా అర్థం చేసుకుంటారు. బయటి వారితో సంబంధం లేదు. మన నిర్ణయాన్ని ఇతరులు అమలు చేయరు. మనమే పాటించాలి. ఈ విధంగా కౌన్సెలింగ్‌లో వివరిస్తూ ఇతర అంశాలను, ఉదాహరణలను ఉటంకిస్తూ మార్చేందుకు ప్రయత్నించాలి. మార్పు పక్కా వస్తుంది.
యాంగ్రీ మేనేజ్మెంట్తో కౌన్సెలింగ్
కరోనా తర్వాత వచ్చిన వెయ్యి కేసుల్లో భార్యాభర్తల మధ్య అసహనం పెరిగిపోయిన విషయాన్ని గమనించాం. ఈ కాలంలో వారికి కలిగిన ఆర్థిక నష్టం, 24/7 కలిసి ఉండడంతో వారి ప్రవర్తనల విషయాల్లో మార్పులపై అనవసర అపోహలను పెంచుకుని ముఖ్యంగా ఉద్యోగులైన భార్యాభర్తల్లో కొట్లాటలు చాలా పెరిగాయి. ఆన్లైన్ క్లాసులు, చదువులంటూ పిల్లలు ఫోన్లకు అత్తుకుపోవడం వారిలో కోపాన్ని విపరీతంగా పెంచేసేంది. ఈ అసహనానికి ఆన్లైన్లో జూదం, అశ్లీలం, మద్యం తోడవడంతో మనస్సులను కకావికలం చేసి నెగిటివ్ ఆలోచనలను పెంచేసింది. ఊహభరితమైన ఆలోచనలతో మనస్సుకు గాయమైన వ్యక్తి విచిత్రంగా ఆలోచిస్తుండడంతో మానసిక ధైర్యం కోల్పోతున్నారు. ఇలా ఇటీవల తమ దగ్గరకు వచ్చిన దాదాపు వెయ్యి మందిని పరిశీలించినప్పుడు ఈ అంశాలు కనపడ్డాయి. వారికి 5 నుంచి 8 రౌండ్లు కౌన్సెలింగ్ ఇచ్చినా మార్పు కనపడడం లేదు. మేము ఇచ్చిన కౌన్సెలింగ్‌తో కేవలం 25 శాతం ఫలితాలను మాత్రమే సాధించాం. – లావణ్య, మానసిక విశ్లేషకురాలు