కంఠేశ్వర్ మార్చ్ 18 : అంగన్వాడీ(Anganwadi workers) ఉద్యోగుల కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగులు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముట్టడి చేపట్టగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ సమస్యలకు సమాధానం దొరికే వరకు కదిలేది లేదని అంగన్వాడీ ఉద్యోగులు భీష్ముంచుకుని కూర్చున్నారు. ఉదయం 9:30 గంటలకే కలెక్టరేట్ ముట్టడి చేపట్టడంతో పది గంటలకు ఆఫీస్ కి వెళ్లే కలెక్టరేట్ ఉద్యోగులు బయటనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. పోలీసులు ఎంత నచ్చజెప్పినా అంగన్వాడీ ఉద్యోగులు ప్రధాన గేటు వద్ద నుండి కదలకపోవడం, ధర్నా జరుగుతున్న సమయంలో అదనపు కలెక్టర్ వాహనం వచ్చి తిరిగి వెళ్లిపోవడం గమనార్హం.
ఈ సందర్భంగా అంగన్వాడీకార్యకర్తలు నినాదాలు చేస్తూ ప్రభుత్వం తమను ఆదుకోవడం లేదన్నారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులు చేసేదే పని మేము చేసేది పనులు కాదా ?మ మాకు కుటుంబాలు లేవా? మా పిల్లలను మేము ఎట్లా పోషించుకోవాలని ప్రశ్నించారు. చాలీచాలని జీతంతో ఎట్లా బతకాలని, కనీస వేతనం 26,000 ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫోన్లో ప్రభుత్వం పెట్టిన యాప్ పని చేయకపోతే తమను బాధ్యులను చేస్తున్నారని, మెమోలు ఇచ్చి జీతాలు కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ యాప్ తొలగించాలని, ఫొటో క్యాప్చర్ తీసివేయాలని డిమాండ్ చేశారు. మినీ అంగన్వాడీ వాళ్లకు గత తొమ్మిది నెలల నుండి మెయిన్ జీతం ఇవ్వట్లేదని, మినీ జీతమే ఇస్తున్నారని వెంటనే మెయిన్ జీతం ఇవ్వాలన్నారు. పెండింగ్ బిల్లు, టీఏడీఏలు చాలా పెండింగ్లో ఉన్నాయని, తమ సమస్యలను తీర్చేదాక ప్రభుత్వం పై పోరును కొనసాగిస్తామని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం మాటలతోనే పబ్బం కడుగుతుందని అంగన్వాడీ ఉద్యోగులను ఆదుకోకపోతే పరిణామాలు తీవ్రస్థాయిలో ఉంటాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులను పోలీసులు సముదాయించి పక్కకు కూర్చోమని చెప్పగా ఉద్యోగులు ఎంతకు ససేమిరా కదలకపోవడం, కలెక్టర్ వచ్చి తమతో మాట్లాడే వరకు జరగం అని భీష్మించుకొని కూర్చుండడంతో తీవ్ర ఉధృత పరిస్థితులు ఏర్పడ్డాయి.
మహిళ అంగన్వాడీ ఉద్యోగులను మహిళా పోలీసులు బలవంతంగా అక్కడి నుండి తరలించడంతో దాదాపు గంటన్నరసేపు యుద్ధ వాతావరణం నెలకొన్నది. మహిళా పోలీసులు అంగన్వాడి ఉద్యోగులను కాళ్లు చేతులు పట్టుకొని బలవంతంగా లాకెళ్లి పోలీసు వాహనంలో ధర్నా స్థలం నుంచి తరలించారు. పోలీసులు బలవంతంగా తరలిస్తున్న సమయంలో పలువురు అంగన్వాడీ కార్యకర్తలకు చేతులకు గాయాలయ్యాయి. దాదాపు గంటన్నర ధర్నా అనంతరం కలెక్టర్ వచ్చి అంగన్వాడీ ఉద్యోగులతో మాట్లాడడంతో వివాదం సద్దుమణిగింది.