కంటేశ్వర్ : నిజామాబాద్ మార్కెట్ యార్డ్ (Nizamabad market yard) వ్యవహారం రచ్చకెక్కింది. శనివారం మార్కెట్ యార్డులో దాదాపు రెండు గంటల పాటు హమాలీలు ధర్నా నిర్వహించారు. మార్కెట్ యార్డ్‌లో ఉన్న అన్ని సంఘాల కార్మికులు మార్కెట్ కమిటీ చైర్మన్‌కు ( Chairman ) వ్యతిరేకంగా ధర్నా చేసి నిరసన తెలిపారు.
కార్మికులు పసుపు దొంగతనం చేస్తున్నారని మార్కెట్ కమిటీ నుంచి ఆరోపణలు రావడంతో కార్మికులు ఆందోళన చేపట్టారు. దీంతో మార్కెట్‌యార్డులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చి సమాదానం చెప్పాలంటూ ఆందోళన చేపట్టడంతో యార్డులో క్రయ, విక్రయాలు నిలిచిపోయాయి. కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కార్మికులపై దొంగతనాలు మోపడం సమంజసమని కాదని అన్నారు. పాలకవర్గంలోని కొందరు సభ్యులు కార్మికులను, మార్కెట్ యార్డును అబాసు పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని , కార్మికులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
తమను దొంగలుగా చిత్రీకరించిన వ్యక్తులు బహిరంగంగానే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రాత్రి రెండు గంటల సమయంలో మార్కెట్ యార్డును సందర్శిస్తున్నానని అంటున్నారని, ఇప్పటివరకు ఎంతమంది దొంగలను పట్టుకున్నారో చైర్మన్ తెలుపాలని డిమాండ్ చేశారు.
జిల్లా నుంచే కాకుండా పొరుగున ఉన్న జిల్లాలో రైతులు సైతం తమ పంట ఉత్పత్తులను పంట యార్డుకు తీసుకొచ్చి కార్మికుల పై నమ్మకంతో పంటను అక్కడే వదిలేసి వెళ్లి వస్తారని తెలిపారు. కార్మికులకు మాట్లాడడానికి వచ్చిన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డిని కార్మికులు ముట్టడించారు. అప్పటికి ఆగ్రహంతో ఉన్న కార్మికులు సెక్యూరిటీ ఇన్చార్జి శ్రీనివాస్‌పై దాడి చేశారు.