కామారెడ్డి, ఏప్రిల్ 9: బాన్సువాడ డివిజన్లో కల్తీ కల్లు ఘటన మరువక ముందే మరోసారి గాంధారి మండలంలో ‘కల్తీ’ కలకలం రేపింది. గాంధారి మండలంలోని గౌరారం గ్రామంలో మంగళవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా కల్లు తాగిన గ్రామానికి చెందిన 30 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఆరుగురు సీరియస్‌గా ఉన్నారు. బాధితులను కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించి, చికిత్సలు అందిస్తున్నారు.
అంకోల్ తండాకు చెందిన సత్తవ్వ ఐసీయూలో చికిత్స పొందుతున్నది. అంకోల్ తండాకు చెందిన బుజ్జి, గౌరారం గ్రామానికి చెందిన కేశవ్వ, లాలు, మహమూద్, మీరాబాయి, సౌందర్య, దుర్కి గ్రామానికి చెందిన సాయిబాబా ఐసోలేషన్ వార్డులో ఉన్నారు. కల్తీ కల్లు తాగడంతో తమవారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, కల్లు విక్రయిస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుల బంధువులు డిమాండ్ చేశారు.
రామారెడ్డి(గాంధారి), ఏప్రిల్ 9: కల్తీ కల్లు ఘటనపై గౌరా రం గ్రామాన్ని కామారెడ్డి జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ బు ధవారం సందర్శించారు. బాధిత కుటుంబ సభ్యులతో మా ట్లాడారు. పలు ఇండ్లలో ఉన్న కల్లును వైద్య సిబ్బంది పారబోయించారు. మెడికల్ ఆఫీసర్ సాయికుమార్ ఉన్నారు.
బాన్సువాడ/ నస్రుల్లాబాద్, ఏప్రి ల్ 9: కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్, బీర్కూర్, బాన్సువాడ, గాం ధారి మండలాల్లో మొత్తం 89మంది కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై దవాఖానల్లో చేరారని డీసీహెచ్ఎస్, బాన్సువాడ ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ విజయలక్ష్మి బుధవారం తెలిపారు. బాధితుల్లో 12 మంది డిశ్చార్జి కాగా.. 77మంది పలు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
బాన్సువాడ ప్రభుత్వ ఏరియా దవాఖానలో 63 మంది చేరగా.. 10మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. నిజామాబాద్‌కు తరలించిన వారిలో 13 మంది ప్రభుత్వ దవాఖానలో, ఒకరు ఎమ్మా ర్ దవాఖానలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో పది మంది కల్తీకల్లు బాధితులు ఉన్నారని తెలిపారు. కల్తీ కల్లు విక్రయించిన కేసులో నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామానికి చెందిన ఉడతల లక్ష్మాగౌడ్ను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు బాన్సువాడ రూరల్ సీఐ రాజేశ్ తెలిపారు.