నిజామాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ఉమ్మడి జిల్లాలో కల్తీ కల్లు మాఫియా రెచ్చిపోతున్నది. కొందరి ధన దాహం అమాయకుల ప్రాణాల మీదకు తెస్తున్నది. మోతాదుకు మించి రసాయనాలు, మత్తు పదార్థాలు కలిపి తయారు చేస్తున్న కల్లు ప్రజలను పరేషాన్ చేస్తున్నది. కల్తీ కల్లు మాఫియాను కట్టడి చేయాల్సిన ఎక్సైజ్ శాఖ ‘ముడుపుల’ మత్తులో నిద్దరోతున్నదన్న ఆరోపణలున్నాయి. అధికారులు సక్రమంగా పని చేస్తే బాన్సువాడ డివిజన్లో కల్తీ కల్లు ఉదంతం వెలుగు చూసేదే కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
మాఫియా ధన దాహంతో పాటు ఆబ్కారీ శాఖ కూడా నిర్లక్ష్యం మూలంగా 60 మందికి పైగా అస్వస్తతకు గురై దవాఖానల్లో చేరాల్సి వచ్చింది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వారిపై ఉక్కుపాదం మోపాల్సిన ఎక్సైజ్ శాఖ.. అక్రమార్కులకే అండగా నిలవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాన్సువాడ తరహా కల్తీ కల్లు ఘటనలు జరిగితే నాలుగైదు రోజులు హడావుడి చేయడం, ఆ తర్వాత మర్చిపోవడం అధికారులకు ‘మామూలై’పోయింది.
ఇన్చార్జి మంత్రి ఇలాకాలోనే..
ఆబ్కారీ శాఖ అమాత్యుడు జూపల్లి కృష్ణారావు ఇన్‌చార్జీగా ఉన్న ఉమ్మడి జిల్లాలో ఎక్సైజ్ శాఖ అదుపు తప్పింది. యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసింది. తనిఖీల్లేవు. ఆల్ఫాజోలం రవాణాపై నిఘా లేదు. అక్రమంగా సాగుతున్న మద్యం విక్రయాలపై అదుపు లేకుండా పోయింది. అయినప్పటికీ ఆ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు కనీసం దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎక్సైజ్ శాఖలో పూర్తి స్థాయి సిబ్బంది ఉన్నారు.
వీరంతా ఎప్పటికప్పుడు కల్లు కాంపౌండ్లను తనిఖీ చేసి కల్తీని నియంత్రించాలి. కానీ క్షేత్ర స్థాయిలో తనిఖీలే లేవు. మామూళ్లు ఎరగా వేస్తున్న కల్లు మాఫియా.. ఇష్టానుసారంగా కల్లు తయారు చేసి జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నది. అధికార పార్టీ నేతల అండదండలతో రెచ్చిపోతున్నారు. వాస్తవానికి ఎక్సైజ్ అధికారులు రెగ్యులర్‌గా తనిఖీలు చేస్తే కల్తీ కల్లు బారిన పడి ప్రజలు విలవిల్లాడాల్సిన దుస్థితి తలెత్తేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇన్చార్జి మంత్రి ఇకనైనా ఉమ్మడి జిల్లాను పట్టించుకుని, అదుపు తప్పిన ఆబ్కారీ శాఖను సరైన దారిలో పెట్టాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.
స్వచ్ఛమైన కల్లు ఏది?
ఆబ్కారీ శాఖ అనుమతితో వెలిసిన కల్లు బట్టీల్లో స్వచ్ఛమైన చెట్ల కల్లు అందుబాటులో ఉండాలి. ఈత, తాటి చెట్ల నుంచి తీసిన కల్లు మాత్రమే విక్రయించాలి. కానీ అందుకు విరుద్ధంగా కల్లు కాంపౌండ్లలో రసాయనాలతో చేసిన కల్లునే సీసాల్లో నింపి అమ్ముతున్నారు. బహిరంగంగానే వేలాది లీటర్లలో ఆల్ఫాజోలం వంటి మత్తు పదార్థాన్ని కలిపి కృత్రిమ కల్లును సృష్టిస్తున్నారు. ఇదీ అచ్చంగా కల్లు మాదిరిగానే కనిపిస్తుంది. మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో పేదలు, రోజువారీ కూలీలు ఈ కల్లు వైపే మొగ్గు చూపుతున్నారు. దీనికి అలవాటు పడిన వారు స్వచ్ఛమైన కల్లు తాగడానికి ఇష్టపడరు.
ఆల్ఫాజోలం ప్రభావం మూలంగా నరాల బలహీనతకు గురవుతాయి. తద్వారా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొంతకాలం తర్వాత మంచానికే పరిమితమయ్యే ప్రమాదం ఉంటుంది. ఆల్ఫాజోలంతో కల్లు తయారు చేస్తూ మాఫియా రూ.కోట్లకు పడగలెత్తుతున్నది. రాజకీయ పార్టీల్లో ప్రాబల్యం పెంచుకుంటూ, అధికారులను మచ్చిక చేసుకుని తమ దందాకు అడ్డు లేకుండా చూసుకుంటున్నది. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే ఆశతో క్లోరో హైడ్రేట్, డైజోఫాం, ఆల్ఫాజోలం వంటి ప్రమాదకరమైన రసాయనాలు వినియోగిస్తూ కల్తీ కల్లు మాఫియా రెచ్చిపోతున్నది
విషమంగానే ఇద్దరి పరిస్థితి
-64కు చేరిన కల్తీ కల్లు బాధితుల సంఖ్య
బాన్సువాడ, ఏప్రిల్ 8: బాన్సవాడ డివిజన్లో కలకలం రేపిన కల్తీ కల్లు ఉదంతంలో బాధితుల సంఖ్య 64కి చేరింది. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి, అంకోల్ , అంకోల్ తండాతో పాటు బీర్కూర్ మండలంలోని దామరంచ గ్రామాల్లో కల్తీ కల్లు కారణంగా 64 మంది అస్వస్తతకు గురయ్యారు. సోమవారం నుంచి మంగళవారం సాయంత్రం వరకు బాన్సువాడ దవాఖానకు అంబులెన్సులు క్యూ కట్టాయి. బాధితులను బాన్సువాడ, నిజామాబాద్, కామారెడ్డి దవాఖానల్లో చేర్పించారు. నిజామాబాద్‌లో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. బాన్సువాడలో ఉన్న బాధితులు కోలుకుంటున్నారని దవాఖాన సూపరింటెండెంట్ విజయలక్ష్మి తెలిపారు.
బాధితులకు పోచారం పరామర్శ
బాన్సువాడ, ఏప్రిల్ 8:ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ కల్లు తయారీదారులు, విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఎక్సైజ్ అధికారులకు సూచించారు. బాన్సువాడ దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను సబ్ కలెక్టర్ కిరణ్మయితో కలిసి పోచారం మంగళవారం పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కల్తీ కల్లు తయారీలో ఎవరున్నా వదిలి పెట్టొద్దని అధికారులకు సూచించామన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదని హెచ్చరించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూపరింటెండెంట్ విజయలక్ష్మికి సూచించారు.
కల్లు తాగితే ఇట్లయ్యింది..
బాన్సువాడ, ఏప్రిల్ 8 : రోజు తాగినట్లు కల్లు దుకాణానికి పోయి కల్లు తాగిన. తాగినంక పాణం పోయినట్లయ్యింది. కండ్లు తిరుగుకుంటా నరాలు పట్టినయి. మెడలు వంకర్లు పడితే పిల్లలు పరేషాన్ అయ్యిండ్రు. పైసలు పెట్టి పాణం మీదకు తెచ్చుకున్నట్లయ్యింది. కల్తీ కల్లు మందు వేరేది కలిపి మా ప్రాణాలు తీస్తుండేనేమో. కల్లు తయారీలో ఏం చేసిండ్రో అర్థం కాలేదు. ప్రాణాలు తీసే కల్లును దుకాణాల వాళ్లను అమ్మకుంట చేయాలే .
-కె. సాయిలు, దుర్కి
కల్తీ కల్లు అని మాకు తెల్వది..
రోజూ పనిచేసి వచ్చి ఒకసీసా కల్లు తాగి , బుక్కెడు తిని పండుకుంటం. కానీ గిసుంటి కల్లు అమ్మి మా ప్రాణాలు తీస్తుండే. కల్తీ కల్లు తయారు చేపిచ్చిన ముస్తేదారులను పట్టుకోవాలె. ఒక్కలా ఇద్దరా యాభై అరవై మంది అంబు లెన్సులో వచ్చిండ్రు.. దవాఖానలో మంది పట్టలే. డాక్టర్లు పట్టించుకోవట్లే మేము బయటపడినం. కల్లీ కల్లు అమ్మి పరేషాన్ చేస్తే , సార్లు పట్టుకోరా. అది కల్తీ కల్లు అని మాకు తెల్వదు.
-ఆర్ పోచయ్య, దామరంచ
23 మంది అరెస్టు.. 18 లైసెన్సులు రద్దు
బాన్సువాడ, ఏప్రిల్ 8: కల్తీ కల్లు ఉదంతం నేపథ్యంలో 23 మందిని అదుపులోకి తీసుకున్నట్లు నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషన్ సోమిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన బాన్సువాడ ఎక్సైజ్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ కల్లు తయారీదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. దుర్కిలో 9మంది, అంకోల్‌లో ఏడుగురు, దామరంచలో ఇద్దరిని కలిపి మొత్తం 18 మంది ఎఫ్టీఎల్ లైసెన్సులు రద్దు చేశామని చెప్పారు.
దుర్కిలో అనుమతులు లేకుండా నడిపిస్తున్న కల్లు డిపోను సీజ్ చేసినట్లు వివరించారు. కల్తీ కల్లు ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు కామారెడ్డి సూపరింటెండెంట్ హన్మంత్‌రావును నియమించామన్నారు. శాంపిల్స్‌ను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించామన్నారు.