నిజామాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ఏ ప్రభుత్వమైనా చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పని చేస్తుంటుంది. విధానపరమైన మార్గదర్శకాలు జారీ చేసి వాటిని కచ్చితంగా అమలు చేస్తుంటుంది. కానీ మన రాష్ట్రంలో మాత్రం అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నది. రేవంత్ సర్కారు స్వతహాగా జారీ చేసిన జీవోలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. సాక్షాత్తు సీఎం అట్టిపెట్టుకున్న విద్యాశాఖలో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతున్నది. ఎమ్మెల్యేల జోక్యంతో ఇష్టానుసారంగా టీచర్ల డిప్యుటేషన్లు, సర్దుబాట్లు చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
11 నెలల కాంగ్రెస్ పరిపాలనలో విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో కింది స్థాయిలో యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయి. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖలో అడుగడుగునా ఎమ్మెల్యేలే ఉల్లంఘనలకు పాల్పడుతూ ప్రభుత్వ ప్రొసిడింగ్స్‌కు తూట్లు పొడుస్తున్న ఉదంతాలు కామారెడ్డి జిల్లాలో జోరుగా వెలుగు చూస్తున్నాయి. ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు మదన్మోహన్రావు, లక్ష్మీకాంతారావు స్వయంగా సిఫార్సు చేసిన లేఖలను ఆధారంగా చేసుకుని విద్యాశాఖ అధికారి ఇష్టానుసారంగా డిప్యుటేషన్లు, సర్దుబాట్లు పేరుతో టీచర్లకు స్థాన చలనం కల్పించడం తీవ్ర దుమారం రేపుతున్నది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేఖలను కళ్లకద్దుకుంటూ డీఈవో విచ్చలవిడిగా టీచర్లను మార్చేస్తుండడం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గ్రామీణ ప్రాంతాల్లో సర్దుబాటు చేయాలని సర్కారు ఆదేశిస్తే, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
సాక్ష్యాలివిగో..
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలం తాండూర్‌లో కె.స్వప్న ఫిజికల్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. తన కుటుంబ సభ్యుల ఆరోగ్య కారణాల రీత్యా సర్దుబాటు కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావుకు విన్నవించుకున్నారు. దీంతో స్పందించిన ఆయన.. అదే నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలం పద్మాజివాడికి బదిలీ చేయాలంటూ డీఈవోకు ఎండార్స్మెంట్ చేశారు. దీంతో నిబంధనలను గాలికొదిలేసిన డీఈవో ఆమెను నాగిరెడ్డిపేట నుంచి కదిలించేశారు. ఇదేమని అడిగితే ఎమ్మెల్యే లేఖ ఇచ్చారు. సర్దుబాటు చేశానంటూ డీఈవో చెబుతున్నారు.
జుక్కల్ మండలం కౌలాస్ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఏనుగు సతీశ్ స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. కామారెడ్డిలో నివాసముండే అతడి భార్య కూడా ప్రభుత్వ ఉద్యోగి కావడంతో కుటుంబ అవసరాల పేరు చెప్పి స్థానిక ఎమ్మెల్యే దగ్గరి నుంచి సిఫార్సు లేఖను తెచ్చుకున్నాడు. దీంతో డీఈవో సర్దుబాటుకు ఓకే చెప్పాడు. విశేషమేమిటంటే జుక్కల్ నియోజకవర్గం నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మత్తమాల అనే గ్రామానికి సర్దుబాటు చేశారు. మత్తమాలలో ఉన్న మరో టీచర్‌ను కామారెడ్డికి పంపించారు.
అవసరాలు ఏ విధంగా ఉన్నప్పటికీ, మానవీయ కోణంలో ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు అందించినప్పటకీ, అధికారులు నిబంధనలు కచ్చితంగా పాటించడం తప్పనిసరి. కానీ విద్యాశాఖ అధికారులు మాత్రం ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. పైగా, ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫారసు లేఖలకు సంబంధించిన అంశాల్లోనూ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. 2021లో ఇచ్చిన జీవో నం.25ను. ఆ జీవోను ఉటంకిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్‌లో జారీ చేసిన ప్రొసిడింగ్స్‌కు సైతం తూట్లు పొడిచారు. జుక్కల్ మండలం బస్వాపూర్ నుంచి సదాశివనగర్ మండలం తిర్మన్‌పల్లికి, నాగిరెడ్డిపేట మండలం చీనూర్ నుంచి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే స్కూల్ అసిస్టెంట్‌ను డీఈవో ఆఫీస్‌కు డిప్యుటేషన్‌పై మార్చారు.
లింగంపేట మండలంలోని ఓ హైస్కూల్ నుంచి కామారెడ్డి లోకల్‌కు ఒకరిని కదిలించారు. ఎల్లారెడ్డి బాలికల హైస్కూల్లో పని చేసే స్కూల్ అసిస్టెంట్‌ను పాల్వంచకు డిప్యూటేషన్‌పై పంపించారు. రామారెడ్డి మండలం పోసానిపేట నుంచి కామారెడ్డి పట్టణానికి ఒకరిని, భిక్కనూర్ మండలం నుంచి మాచారెడ్డికి మరొకరిని కదిలించారు. ఇలా ఎంతో మందిని నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా కదిలించారు.
వందల్లో సర్దుబాట్లు..
కాంగ్రెస్ సర్కారు జారీ చేసిన మార్గదర్శకాల మేరకు సర్దుబాట్లకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేనప్పుడు, వివిధ అవసరాలు ఉన్నప్పుడు సంబంధిత కాంప్లెక్స్ హెడ్ మాస్టర్, మరో సీనియర్ హెడ్ మాస్టర్, ఎంఈవోతో కూడిన కమిటీ భేటీ కావాలి. ఇందులో అవసరాలను గుర్తించి అదే మండలంలో సర్దుబాట్లను చేయాలి. కానీ కామారెడ్డి జిల్లాలో మాత్రం అలాంటిదేమీ జరగడం లేదు. సర్దుబాట్ల పేరుతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే లేఖలతో కొందరు, ఉపాధ్యాయ సంఘాల లీడర్ల పైరవీలతో మరికొందరు, లంచాలు ఎర వేసి ఇంకొందరు.. ఇలా రకరకాలుగా వివిధ మండలాల్లో పని చేస్తున్న వారంతా పట్టణాలు, పట్టణ సమీప ప్రాంతాలకు సర్దుబాటు పేరుతో వచ్చేస్తున్నారు.
ఫలితంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి దెబ్బతింటున్నది. తెలిసీ తెలియకో ఎమ్మెల్యేలు లేఖలు జారీ చేస్తే వాటిని బూచీగా చూపిస్తూ డీఈవో ఇష్టారీతిన ఉత్తర్వులు జారీ చేస్తుండడం చర్చనీయాంశమవుతున్నది. సర్దుబాట్ల ద్వారా సుమారుగా వందకుపైగా టీచర్లు తమ పోస్టింగ్ జాగాను వదిలేసి ఇతర ప్రాంతాల్లో పని చేస్తున్నారు. రాజకీయ నాయకులతో సంబంధాలు, ఆర్థికంగా బలంగా ఉన్న వారు, యూనియన్ లీడర్లతో అంటకాగుతున్న చాలా మంది టీచర్లకు డీఈవో తీరు కలిసొస్తున్నది. ఈ సర్దుబాట్ల వెనుక భారీగా ముడుపులు ముడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై విచారణ చేయిస్తే దొంగ లెక్కలన్నీ బయటపడే అవకాశాలున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
విచారణ జరిపించాలి..
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కామారెడ్డి విద్యాశాఖలో డిప్యు టేషన్లు చేపడుతున్నారు. జిల్లా స్థాయి అధికారులతో పాటు మండల విద్యాశాఖ అధికారులు కలిసి సర్దుబాటు పేరుతో అక్రమాలు చేస్తున్నారు. ఈ విషయంపై సమగ్రంగా విచారణ చేస్తే అనేక బాగోతాలు బయటపడే అవకాశాలున్నాయి. ప్రభుత్వ పెద్దలను, ఎమ్మెల్యేలను కొంత మంది విద్యాశాఖ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి.
– చకినాల అనిల్ కుమార్, టీపీటీఎఫ్(తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్) రాష్ట్ర నాయకుడు