గజ్వేల్, డిసెంబర్ 5 : తెలంగాణలో జరుగుతున్న అద్భుతమైన అభివృద్ధికి గజ్వేల్ పట్టణం మోడల్‌గా నిలుస్తుందని, సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ఇక్కడి నిర్మాణాలను చేపట్టారని నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రా అన్నారు. గజ్వేల్ పట్టణంలోని సమీకృత మార్కెట్, అర్బన్‌పార్కు, మహతి ఆడిటోరియం, ఎడ్యుకేషన్ హబ్, ఐవోసీ భవనం తదితర అభివృద్ధి పనులను నిజామాబాద్ జిల్లా అధికారులతో కలిసి ఆమె సోమవారం సందర్శించారు. సమీకృత మార్కెట్‌ను సందర్శించిన అధికారుల బృందానికి స్థానిక ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ పుష్పగుచ్ఛాన్ని అందజేసి స్వాగతం పలికారు.
మార్కెట్లో వెజ్, నాన్‌వెజ్, పండ్లు, పూల విక్రయదారులతో అడిషనల్ కలెక్టర్ మాట్లాడి వ్యాపారాలు ఎలా సాగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్వహించిన శిక్షణతోపాటు మార్కెట్లో అందిస్తున్న సౌకర్యాల గురించి ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ వివరించారు. అనంతరం అధికారులు గజ్వేల్ బాలుర, బాలికల ఎడ్యుకేషన్ హబ్‌లు, మహతి ఆడిటోరియం, ఐవోసీ భవన సముదాయం, అర్బన్ పార్కును సందర్శించారు. వారికి గజ్వేల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఆయా నిర్మాణాల గురించి వివరించారు. గజ్వేల్ అర్బన్‌పార్కులో వసతులు, నిర్వహణ, ఆదాయం తదితర వివరాలను బీట్ ఆఫీసర్ అర్జున్ వెల్లడించారు. మహిళా డిగ్రీ కళాశాలలో వసతులు, విద్యార్థుల సంఖ్య, గతంలో కళాశాల పరిస్థితుల గురించి ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమాశశి వివరించారు.