కంఠేశ్వర్, మే 30: చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై కఠినచర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ అంకిత్ తెలిపారు. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో పీసీపీఎన్డీటీ యాక్ట్నకు సంబంధించి జిల్లా కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో 151 స్కానింగ్ సెంటర్లు ఉంటే 125 మాత్రమే పనిచేస్తున్నాయని, వీటన్నింటికీ రిజిస్ట్రేషన్లు రెన్యువల్ చేసుకోవాలని, స్కానింగ్ సెంటర్లో లింగ నిర్ధారణ చేయొద్దని తెలిపారు.
అర్హులైన సిబ్బందినే నియమించుకోవాలని సూచించారు. డీఎంహెచ్‌వో తుకారాం రాథోడ్ మాట్లాడుతూ గత 25న జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశం నిర్వహించగా స్కానింగ్ సెంటర్ల ఏర్పాటుకు 3 దరఖాస్తులు వచ్చాయని, రిజిస్ట్రేషన్ రెన్యువల్‌కు 11, సెంటర్ల రద్దు కోసం 3 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. మహిళా, శిశు సంక్షేమ శాఖతో కలిసి మండలాల్లో విస్తృతంగా అవగాహన కల్పించామన్నారు. సమావేశంలో ఏసీపీ ఎల్ రాజావెంకటరెడ్డి, సీడీపీవోలు స్వర్ణలత, నందిని, లయన్స్ క్లబ్ ఇందూరు అధ్యక్షుడు విజయానంద్, జ్యుడీషియరి సూపరింటెండెంట్ సయ్యద్ ఇర్షాద్ బుకారి తదితరులు పాల్గొన్నారు.