CP Sai Chaitanya | వినాయక నగర్, జనవరి 11 : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాల్లో పేకాట, కోడిపందాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ను ఏర్పాటు చేశామని, నిరంతరం వాహన తనిఖీలు, సరిహద్దు ప్రాంతాల్లో గుర్తించబడిన కొన్ని ప్రదేశాలలో గస్తీని ముమ్మరం చేశామని తెలిపారు.
మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతంలోని నిజామాబాద్ జిల్లా చుట్టూ సరిహద్దు అసాంఘిక కార్యకలాపాల్లో పట్టుబడిన నిందితుల పై చట్టపరంగా కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి సమాచారం తెలిస్తే సంబంధిత పోలీసు అధికారులకు లేదా పోలీస్ స్టేషన్, డయల్ 100 కు సమాచారం అందించాలని ఈ సందర్భంగా సీపీ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచనున్నట్లు పేర్కొన్నారు.