వినాయక్‌నగర్/ కంఠేశ్వర్, నవంబర్ 19: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ భవనంలోని మూడో అంతస్తులోని రూమ్ నంబర్ 13లో ఉన్న టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో బృందం తనిఖీలు చేపట్టింది. ఉదయం మున్సిపల్ కార్యాలయంలోని పలు విభాగాల్లో పనుల నిమిత్తం వచ్చిన ప్రజలతో హడావుడిగా ఉన్న సమయంలోనే ఒక్కసారిగా ఏసీబీ బృందం వచ్చి నేరుగా టౌన్ ప్లానింగ్ విభాగంలోకి వెళ్లింది. దీంతో ఏం జరుగుతుందో అంతు పట్టక అటు అధికారులు ఇటు సిబ్బంది, ప్రజలు అయోమయానికి గురయ్యారు.
ఏసీబీ అధికారులు లోపలి నుంచి తలుపులు పెట్టుకొని, లోపల ఉన్న వారు బయటికి రాకుండా, బయట ఉన్న వారిని లోపలికి రానివ్వకుండా కట్టడి చేశారు. కార్యాలయం బయట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న పలువురు సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు చేసినట్లు సమాచారం. టౌన్ ప్లానింగ్ విభాగం లోనికి వెళ్లిన ఏసీబీ అధికారులు అక్కడ ఉన్న ఫైళ్లు, డాక్యుమెంట్లు, రికార్డులు, కంప్యూటర్లలోని డాటాను క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు తెలిసింది.
పొద్దంతా తనిఖీలు.. అక్కడే భోజనాలు
ఉదయం కార్యాలయంలోకి వెళ్లిన ఏసీబీ అధికారుల బృందం రాత్రి వరకూ అక్కడే ఉండి సోదాలు చేసింది. తాము తనిఖీలు చేస్తున్నంత వరకు లోపల ఉన్న సిబ్బంది ఎవరూ బయటికి వెళ్లొద్దని ఏసీబీ బృందం ఆదేశించింది. ఏసీబీ అధికారులతోపాటు కార్యాలయంలో ఉన్న సిబ్బందికి భోజనాలు తెప్పించి, లోపలే తినడానికి ఏర్పాట్లు చేశారు.