MLA Vemula Prashanth Reddy | వేల్పూర్ : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం తీవ్ర విధ్వంసానికి గురవుతోందని, గత కేసీఆర్ ప్రభుత్వంలో రైతు రాజుగా బతికితే ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనలో తీవ్ర దగా, మోసానికి గురవుతున్నాడని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతేడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఎన్నడూ బాగుపడదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా విశ్రమించేది లేదని, 1000 రోజుల కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై వేల్పూర్ X రోడ్ వద్ద ఏర్పాటు చేసిన రైతు సదస్సులో ఈ సందర్భంగా వేముల నిప్పులు చేరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన వైఫల్యాలపై బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు బాల్కొండ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన భారీ “రైతు సదస్సు”లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా తరలిరావడం ప్రభుత్వ విధానాలపై అన్నదాతల్లో గూడుకట్టుకున్న తీవ్ర అసంతృప్తికి, ఆగ్రహానికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పల్లెబాట, సకల జనుల సమ్మె ద్వారా గ్రామాల్లో తిరిగినప్పుడు కరెంట్ కోతలు, కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లతో రైతులు పడ్డ గోసను స్వయంగా చూశామని వేముల గుర్తుచేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన ఏడాదిన్నర వ్యవధిలోనే కేసీఆర్ ప్రభుత్వం అద్భుతం చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల ఉచిత, నాణ్యమైన వ్యవసాయ విద్యుత్ అందించిందన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల్లేకుండా 18 సబ్స్టేషన్లు, 45 భారీ (5 MVA) పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి మౌలిక వసతులు పటిష్టం చేశామన్నారు. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ మళ్లీ పాత చీకటి రోజులను తీసుకువచ్చిందని, రోజుకు కనీసం 11 గంటల విద్యుత్ కూడా సక్రమంగా ఇవ్వలేక పదేపదే కోతలు విధిస్తూ అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ స్వయంగా రైతు కాబట్టే ఎవరూ అడగకుండానే ‘మిషన్ కాకతీయ’ పథకం తెచ్చి రాష్ట్రవ్యాప్తంగా 45 వేల చెరువులను బాగు చేయించారని తెలిపారు. బాల్కొండ పరిధిలోని కప్పలవాగు, పెద్దవాగులపై 45 కిలోమీటర్ల మేర ప్రతి 2 కి.మీ.కు ఒకటి చొప్పున 22 చెక్‌డ్యాంలను నిర్మించడమే కాకుండా, కాంట్రాక్టర్లతో మాట్లాడి ప్రభుత్వ డిజైన్ (2.5 మీటర్లు) కన్నా మరో 2-3 ఫీట్ల అదనపు ఎత్తుతో ఉచితంగా నిర్మింపజేసి భూగర్భ జలాలను పెంపొందించామన్నారు. ఇటీవల భారీ వర్షాలకు వచ్చిన వరద వళ్ళ రెండు మూడు చోట్ల మట్టికట్టలు తెగితే వాటికి రూ. 10-20 లక్షలు కేటాయించి పటిష్టం చేయాల్సింది పోయి, కుకునూర్ , సుంకెట్, మోతె, గాండ్లపేట్, పచ్చల నడ్కూడ తదితర ప్రాంతాల్లో చెక్‌డ్యాంలను సగానికి సగం కూల్చివేయడం దుర్మార్గమైన చర్య అని ఆక్షేపించారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి కొరత శాశ్వతంగా తీర్చడం కోసం కేసీఆర్ రూ. 1,900 కోట్ల భారీ వ్యయంతో ‘ఎస్సారెస్పీ పునర్జీవ పథకం’ (రివర్స్ పంపింగ్) పూర్తి చేశారని గుర్తుచేశారు. ప్యాకేజీ-21 ద్వారా సారంగాపూర్, మెంట్రాజ్‌పల్లి పంప్‌హౌస్‌ల నిర్మాణాలు, భారీ పైప్లైన్లు పూర్తి చేసి వాగుల్లోకి కాళేశ్వరం నీటిని తెప్పించి చూపించామన్నారు. ప్రస్తుతం పోచంపాడులో 42 టీఎంసీల నీరు నిల్వ ఉన్నప్పటికీ, కప్పలవాగు, పెద్దవాగులకు నీరు విడుదల చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద రెండు పిల్లర్లు కుంగితే, ఏజెన్సీ బాగుచేస్తామని చెప్పినా రాజకీయం కోసం రెండేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగంగా మార్చి గోదావరి జలాలను సముద్రం పాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. వేమగంటి లిఫ్ట్ ట్రాన్స్ఫార్మర్ దొంగతనానికి గురైతే ఏడాదిన్నరగా బిగించలేదని, గట్టిపొడిచినవాగు,లక్ష్మి, నవాబ్ లిఫ్ట్ , గుత్ప లిఫ్ట్ , బోదేపల్లి లిఫ్ట్ , వేంపల్లి లిఫ్ట్ , చౌట్పల్లి హన్మంత్ రెడ్డి లిఫ్ట్ ,జలాల్పూర్ ఫేజ్-2 మోటార్లను పట్టించుకునే నాథుడే లేడని ఆరోపించారు. గతంలో క్వింటాల్‌కు 2-3 కిలోల తరుగు తీస్తేనే ‘రైతుపై తాలు తీస్తే తోలు తీస్తా’ అని కేసీఆర్ హెచ్చరించేవారని, నేడు కాంగ్రెస్ హయాంలో ఏకంగా 10 నుంచి 19 కిలోల వరకు అడ్డగోలుగా తరుగు తీస్తున్నారని ఆరోపించారు.
ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారం రోజుల్లో డబ్బులేసిన కేసీఆర్ వ్యవస్థను ధ్వంసం చేసి, నేడు రైతులను నెలల తరబడి రోడ్లపై పడిగాపులు కాసేలా చేశారన్నారు. ఎరువుల కోసం ఉమ్మడి రాష్ట్రం నాటిలాగా రైతులు చెప్పులు, పాస్‌బుక్కులు క్యూలైన్లలో పెట్టాల్సిన పరిస్థితిని తెచ్చారని విమర్శించారు. ఎరువుల కొరతను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై ‘ముదనష్టపు మొబైల్ యాప్‌ల’ విధానాన్ని తెచ్చి రైతులను మీ-సేవా కేంద్రాల చుట్టూ తిప్పుతున్నాయని, ఈ యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి సొసైటీలు, దుకాణాల ద్వారా నేరుగా పుష్కలంగా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. 2 లక్షల రుణమాఫీ పూర్తయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేసుకుంటున్నారని, సభలో పాల్గొన్న రైతుల్లో చాలామంది రైతులు చేతులెత్తి తమకు రుణమాఫీ కాలేదని నినదించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎకరానికి రూ. 15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి, పాత రూ. 10 వేల రైతుబంధును కూడా ఎగ్గొట్టారని, ఎన్నికల కోసం ఎకరం, రెండెకరాలంటూ విడతలవారీగా మోసం చేస్తున్నారని తెలిపారు.

వరి ధాన్యానికి రూ. 500 బోనస్ అని చెప్పి ఇప్పుడు కేవలం సన్న వడ్లలో ఏడు రకాలకే పరిమితం చేసి తప్పించుకునే కుట్ర చేస్తున్నారన్నారు. ఎకరానికి 25 క్వింటాళ్ల చొప్పున ఆరు పంటలకు కలిపి ఎకరానికి రూ. 75,000, నాలుగు ఎకరాలున్న రైతుకు రూ. 3 లక్షల బోనస్ బాకీ పడ్డారని లెక్కగట్టారు. రుణమాఫీ రూ. 2 లక్షలు, బోనస్ రూ. 3 లక్షలు, రైతు భరోసా బకాయిలు రూ. 1 లక్ష కలిపి..4 ఎకరాలు ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ. 6 లక్షల మేర బాకీ ఉందని స్పష్టం చేశారు. రైతు బలపడితేనే తెలంగాణ బలపడుతుంది అని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని, ఎన్నికల హామీలు లొడలొడ మాటల్లో కాకుండా చేలల్లో ఫలితాల రూపంలో కనిపించాలని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల తరఫున ఆమోదించిన ఈ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్నదాతలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
‘కాంగ్రెస్ గ్యారంటీల బాకీ కార్డు’ ఫ్లెక్సీలతో కాంగ్రెస్ నాయకులకు భయం
ప్రభుత్వ బాకీలను ఎండగడుతూ గ్రామాల్లో పెడుతున్న ఫ్లెక్సీలను చూసి కాంగ్రెస్ నాయకులకు భయం పట్టుకుందని, మంత్రి సుదర్శన్ రెడ్డి ఒత్తిడితో అధికారులు, పోలీసులు ఫ్లెక్సీలను తీసేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ హామీల వైఫల్యాన్ని ఎండగట్టడం ప్రజాస్వామ్య హక్కని, పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలోగ్గకుండా రైతుల పక్షాన ఉండాలని సీపీ కి ఎమ్మెల్యే సూచించారు. గ్రామాల్లో ఫ్లెక్సీలను తొలగించాలని చూస్తే ప్రజలు, రైతులు, కార్యకర్తలు ఐక్యంగా తిరగబడాలని, అవసరమైతే తానే స్వయంగా వచ్చి అడ్డుకుంటానని, కేసులు పెడితే తనపైనే పెట్టుకోవాలని స్పష్టం చేశారు.
రైతు సదస్సులో రైతుల ఆమోదంతో ఏకగ్రీవంగా ఆమోదించిన ప్రధాన డిమాండ్లు
1. సంపూర్ణ రుణమాఫీ: షరతులు లేకుండా అర్హులైన రైతులందరికీ తక్షణమే రూ. 2 లక్షల వ్యవసాయ రుణమాఫీ వర్తింపజేయాలి.
2. రైతు భరోసా చెల్లింపు: ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఎకరానికి రూ. 15,000 పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టిన పాత బకాయిలతో సహా పూర్తిస్థాయిలో రైతుల ఖాతాల్లో జమ చేయాలి.
3. రూ. 500 బోనస్ & పాత బకాయిలు: గత ఆరు సీజన్లలో పండించిన పంటలకు బోనస్ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు, రాబోయే సీజన్లలో అన్ని పంటలకూ క్వింటాల్‌కు రూ. 500 బోనస్ చెల్లించాలి.
4. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్: లో-వోల్టేజ్ సమస్యలు లేకుండా గత బీఆర్ఎస్ పాలన తరహాలోనే రైతులకు నిరంతరాయంగా 24 గంటల వ్యవసాయ విద్యుత్ సరఫరా చేయాలి.
5. యూరియా యాప్‌ల రద్దు: గందరగోళానికి గురిచేస్తున్న మొబైల్ యాప్‌ల విధానాన్ని వెంటనే రద్దు చేసి, పీఏసీఎస్ సొసైటీలు, డీలర్ల వద్ద నేరుగా ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలి.
6. కాళేశ్వరం, ఎస్సారెస్పీ పునరుద్ధరణ: కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేసి అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లికి నీటిని తరలించాలి. అక్కడి నుంచి ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పంపుల ద్వారా శ్రీరాంసాగర్‌ను, వరద కాలువను నింపాలి.
7. సాగునీటి విడుదల & లిఫ్టుల పునరుద్ధరణ: ఎస్సారెస్పీ లక్ష్మీ కెనాల్ గేట్లను ఎత్తి ఆయకట్టుకు నీరివ్వాలి. చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి లిఫ్ట్, బొదేపల్లి, వేంపల్లి, నవాబ్, గుత్ప ఎత్తిపోతల పథకాలను నడిపించి పరిధిలోని చెరువులన్నింటినీ నింపాలి. ప్యాకేజీ-21 ద్వారా సారంగాపూర్, మెంట్రాజ్‌పల్లి మోటార్లను ఆన్ చేసి కప్పలవాగు, పెద్దవాగుల్లోకి తక్షణమే నీటిని విడుదల చేయాలి.
8. రైతుబీమా ప్రీమియం చెల్లింపు: గత నెల 13తో గడువు ముగిసిన రైతుబీమా ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభుత్వం వెంటనే చెల్లించి అన్నదాతల కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా రక్షణను పునరుద్ధరించాలి.