Nizamabad | వినాయక నగర్, డిసెంబర్ 22 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దుండగులు మూడిన్లకు కన్నం వేశారు. స్థానిక వినాయక నగర్ ప్రాంతంలోని మూడు ఇళ్ల తాళాలు ధ్వంసం చేసిన దుండగులు బంగారు నగలు, వెండి వస్తువులు, నగదును దోచుకుపోయారు. వినాయక నగర్ లోని 100 ఫీట్ల రోడ్డు పరిధిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద నివాసం ఉండే వినోద్ అనే వ్యక్తి దంపతులు ఓ ఇంట్లో టైలర్ నిర్వహిస్తుంటారు. దినమంతా టైలర్ లోనే పనిచేసుకునే వారు రాత్రి సమయంలో ఇంటికి వెళ్లిపోతారు.
ఎక్కువ సమయం టైలర్ లోనే ఉండడం వల్ల వారు టైలర్ నిర్వహించే ఇంట్లో బీరువాలో విలువైన వస్తువులు పెట్టుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున దుండగులు టైలర్ తాళం ధ్వంసం చేసి, గదిలో ఉన్న బీరువా పగలగొట్టి అందులో ఉన్న 8.5 తులాల బంగారు నగలు, అరకిలో వెండి, రూ.40 వేలు నగదు దోచుకు వెళ్లారు. అనంతరం అదే ప్రాంతంలో గల మరో ఓ పూజారి ఇంటి తాళం ధ్వంసం చేసి గదిలోని ఒక తులం బంగారం, రూ.8 వేలు నగదు దోచుకు వెళ్లారు. వినాయక నగర్ లో ఒంటరిగా ఉండే ఓ మహిళ తన ఇంటికి తాళం వేసి పక్కింట్లో పడుకుంది.
ఆమె ఇంటి తాళాన్ని ధ్వంసం చేసిన దుండగులు ఇంట్లోని రూ.30 వేల నగదు దోచుకు వెళ్లారు. మూడిళ్లలో మొత్తం 9.5 తులాల బంగారు నగలు, అరకిలో వెండి, రూ.78వేలు నగదు దోచుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు నాలుగో టౌన్ ఎస్హెచ్ఓ సతీష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. చోరీ జరిగిన మూడు ఏరియాలో స్థానికంగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలించగా బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి ఉన్నట్లుగా సీసీ ఫుటేజ్ కు చిక్కినట్లు గుర్తించారు.