వినాయకనగర్/ భిక్కనూరు, జనవరి 12: ఉమ్మడి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శుక్రవా రం సాయంత్రం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందగా..ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని దవాఖానకు తరలించగా..చికిత్స పొందుతున్నారు. నిజామాబాద్ నగర శివారులోని నెహ్రూనగర్ పరిధిలోని అశోక్ సాగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడగా,మరో యువకుడు తీవ్రగాయాలతో దవాఖానలో చికిత్సపొందుతున్నాడు.
నెహ్రునగర్ కు చెందిన అనాస్(17), సమీర్(20), కరీం ముగ్గురు స్నేహితులు కలిసి బైక్పై జాన్కంపేట్ వైపు వెళ్తున్నారు. అదే సమయంలో అశోక్ సాగర్ వద్ద ఎదురుగా వస్తున్న ఓ కారు వీరి బైక్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో అనాస్, సమీర్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువకుడు కరీంకు తీవ్ర గాయాలుకాగా..స్థానికులు దవాఖానకు తరలించారు. ఘటనా స్థలాన్ని సౌత్ రూరల్ సీఐ వెంకట నారాయణ పరిశీలించి, ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా ఆరో టౌన్ ఎస్సై -2 మొగులయ్య, సిబ్బంది చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు సీఐ తెలిపారు.