వినాయక్‌నగర్, మార్చి 27: ఒకటికి రెండింతలు ఇస్తానని రూ. కోటి వసూలు చేసి చివరికి చేతులేత్తెసింది బీజేపీకి చెందిన ఓ మహిళా నాయకురాలు. దీంతో బాధితులు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడికి గురువారం ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పూసలగల్లీకి చెందిన ఆకుల నీలిమ, వినయ్‌కుమార్ దంపతులు కొంతకాలంగా తమ కులానికి చెందిన వారిని మచ్చిక చేసుకున్నారు.
తమ వద్ద డిపాజిట్ రూపంలో డబ్బులు పెట్టుబడిగా పెడితే వాటిని రెట్టింపు చేస్తామని మహిళలను నీలిమ నమ్మించింది. దీంతో 30 మంది మహిళలు సుమారు రూ.85 లక్షల వరకు నీలిమకు అప్పజెప్పారు. ఇటీవల తమ డబ్బులు ఇవ్వాలని మహిళలు అడుగగా, తన వద్ద ప్రస్తుతం డబ్బులు లేవని నీలిమ చెప్పడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. దీంతో బాధిత మహిళలందరూ నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారికి గురువారం ఫిర్యాదు చేశారు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని కోరారు.