రుద్రూర్, మే 24: సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు రుద్రూర్ మండల కేంద్రంలోని జేఎన్సీ కాలనీలో శనివారం సాయంత్రం ఏసీపీ శ్రీనివాస్ ఆద్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ముగ్గురు ఎస్సైలు, 60 మంది సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇండ్లలో సోదాలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని 97 ద్విచక్రవాహనాలు, నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో భాగంగా ఓ ఇంట్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి వద్ద 40 క్వార్టర్లను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ద్విచక్రవాహన దారులు తమ వాహనాలకు సంబంధించిన పత్రాలను దగ్గర ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రుద్రూర్, బోధన్ సీఐలు కృష్ణ, వెంకటనారాయణ, బోధన్ ఎస్సైతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.