ఆర్మూర్‌టౌన్, మే 23: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో గురువారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెర్కిట్‌కు చెందిన సమీర్ నుంచి అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అద్దెకు కారు తీసుకున్నాడు. తిరిగి ఇచ్చే సమయంలో కారు డ్యామేజ్ అయ్యిందని, బాగు చేయించి ఇవ్వాలని సమీర్ సూచించాడు. అదే విషయమై మాట్లాడుదామని పిలిపించిన ఆ వ్యక్తి సమీర్‌పై దాడికి దిగాడు. విషయం తెలుసుకున్న సమీర్ స్నేహితులు అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటు చేసుకున్నది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించారు. గాయపడిన క్షతగాత్రులను ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించి కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌హెచ్‌వో రవికుమార్ తెలిపారు.