ఎల్లారెడ్డి రూరల్, జూన్ 3: నిజాంసాగర్ బ్యాక్‌వాటర్‌లో సోమవారం ఈతకోసం వెళ్లి గల్లంతైన ముగ్గురు యువకుల మృతదేహాలు మంగళవారం మధ్యాహ్నం లభ్యమయ్యాయి. సోమార్పేట్ అటవీ ప్రాంతంలోని నిజాంసాగర్ బ్యాక్‌వాటర్‌లో సోమవారం సాయంత్రం ఈతకు వెళ్లిన సోమార్పేట్ గ్రామానికి చెందిన బెస్త హర్షవర్ధన్ (17), ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన ఐత నవీన్ (23), నిజాంసాగర్ మండలం నర్సింగ్‌రావ్ పల్లికి చెందిన కల్లేటి మధుకర్‌గౌడ్(16) గల్లంతైన విషయం తెలిసిందే.
స్థానిక పోలీసులు, అగ్నిమాపక రెస్క్యూ టీం, గజ ఈతగాళ్ల సమన్వయంతో సోమవారం రాత్రి 8 నుంచి మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు గాలింపు చర్యలు చేపట్టగా ముగ్గురి మృతదేహాలు బయటికివచ్చాయి. ప్రాజెక్ట్ లోపల కొద్ది దూరంలో బురద గుంతలో మధుకర్‌గౌడ్ మృతదేహం లభ్యంకాగా, నవీన్ మృతదేహం పదకొండున్నర గంటలకు బయటికి వచ్చింది. ఒంటి గంట పదినిమిషాలకు బెస్త హర్షవర్ధన్ మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు తీసుకువచ్చారు. క్రికెట్ ఆడిన స్నేహితులంతా స్నానాల కోసం నిజాంసాగర్ బ్యాక్ వాటర్లోకి వెళ్లగా ముగ్గురు యువకులు లోనికి వెళ్లి మునిగిపోయారు.
ప్రథమున్ని కోల్పోయిన కుటుంబాలు
మృతిచెందిన ముగ్గురు యువకులు వయస్సులో కొంచెం తారతమ్యం ఉన్నా, బాగా స్నేహం వీరిమధ్య ఉండేదని తెలుస్తోంది. మధుకర్గౌడ్ది 9వ తరగతి పూర్తికాగా, బెస్త హర్షవర్ధన్ ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తయింది. ఐత నవీన్ శివ్వానగర్ గ్రామంలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ముగ్గురు క్లాస్‌మెట్స్ కాకున్నా వారిని క్రికెట్ స్నేహితులుగా మార్చింది. మామూలు సమయంలో కూడా ముగ్గురు ఎంతో స్నేహంగా ఉండేవారని తోటి స్నేహితులు తెలిపారు.
అనునిత్యం స్నేహంగా ఉంటూ చావులోనూ ఒకటిగా వెళ్లిపోయారని స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతిచెందిన నవీన్ తల్లిదండ్రులకు ఒకే ఒక్క కుమారుడు, హర్షవర్ధన్ సైతం ఒక్క కుమారుడు కాగా, అతనికి ఒక చెల్లెలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. అలాగే మధుకర్ తల్లిదండ్రులకు మధుకర్ పెద్ద కుమారుడు కాగా అతనికి తమ్ముడు ఉన్నట్లు తెలిసింది. మూడు కుటుంబాల్లో ప్రథమ పుత్రుడిని కోల్పోవడంతో విషాదం నెలకొన్నది. చేతికందివస్తున్న కొడుకులు మృత్యువాతకు గురికావడం ఆ తల్లిదండ్రులకు తీరని పుత్రశోకాన్ని మిగిల్చింది.
బాధితులకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పరామర్శ
ముగ్గురు యువకులు నీట మునిగి మృత్యువాతకు గురైన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. దవాఖానలో మృతదేహాలను సందర్శించారు. అనంతరం ఇండ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
బాధిత కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు నునుగొండ శ్రీనివాస్, మంచిర్యాల విద్యాసాగర్, కుర్మ సాయిబాబా బాధిత కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. మృతదేహాలకు ఎల్లారెడ్డిప్రభుత్వ వైద్యశాలలో సాయంత్రం పోస్ట్‌మార్టం నిర్వహించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు సాయంత్రం వారి అంత్యక్రియలను నిర్వహించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నిజాంసాగర్ పోలీసులు తెలిపారు.