వినాయక్‌నగర్, సెప్టెంబర్ 26 : జిల్లాలో 2025-27 సంవత్సరానికి మద్యం షాపుల టెండర్స్ (గెజిట్) ప్రక్రియ ప్రారంభించినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.మల్లారెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 102 షాపుల్లో ముందుగా ఎస్సీ సామాజిక వర్గానికి-11 , గౌడవర్గానికి-11, ఎస్టీ సామాజిక వర్గానికి-2 మొత్తం 24 షాపులకు రిజర్వేషన్ కోటాకింద గెజిట్ జారీ చేసినట్లు వివరించారు. మిగత 78 షాపులకు టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు చెప్పారు. నిజామాబాద్‌లో 36 షాపులు, ఆర్మూర్-25, బోధన్-18, భీంగల్-12, మోర్తాడ్-11 మద్యం షాపుల ఏర్పాటుకు గెజిట్ జారీ చేసినట్లు తెలిపారు.
ఈనెల 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని సుభాస్నగర్లో ఉన్న ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నా రు. దరఖాస్తుదారులు రూ.1.3 లక్షల (నాన్ రిఫండబుల్) డీడీ/చలాన్, ఆధార్/పాన్‌కార్డ్, మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, కుల ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అక్టోబర్ 23న హైదరాబాద్ రోడ్డులోని భారతీ గార్డెన్స్‌లో డ్రా పద్ధతిలో మద్యం షాపుల కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు. డ్రాలో గెలుపొందిన వారు డిసెంబర్ 1 నుంచి షాపులు ప్రారంభించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. నందిపేట్ని ఓ మద్యం షాపును డొంకేశ్వర్ మండలానికి మార్చనున్నట్లు తెలిపారు. జిల్లాకేంద్రంలోని ద్వారకానగర్‌లోని షాపును ముబారక్‌నగర్ ప్రాంతానికి, బాల్కొండ మండలకేంద్రంలోని షాపును మోపాల్ మండల కేంద్రానికి, కలిగోట్లోని షాపును జక్రాన్‌పల్లి మండలకేంద్రానికి మార్చనున్నట్లు వివరించారు. సమావేశంలో ఎక్సైజ్ సీఐలు స్వప్న, గుండప్ప, మల్లేశ్, భాస్కర్‌రావు, వేణు మహాదేవ్ తదితరులు పాల్గొన్నారు.