ఉభయ జిల్లాలో వరి పంటకే మొగ్గు చూపిన రైతులు
కామారెడ్డిలో గతం కన్నా పడిపోయిన పత్తి సాగు విస్తీర్ణం
అంతంత మాత్రంగానే పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం
అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ విఫలం
ముందస్తు వర్షాలతో ఉమ్మడి జిల్లాలో జోరుగా పంటల సాగు
నిజామాబాద్ జిల్లాలో 4.53లక్షలు, కామారెడ్డిలో 4.57లక్షల ఎకరాలు సాగులోకి..
నిజామాబాద్, ఆగస్టు 23, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యవసాయక ప్రాంతం. అత్యధికులు పంటల సాగునే ప్రధాన వృత్తిగా మలుచుకుని పని చేస్తున్నవారే. భిన్న రకాల పంటలకు ఈ ప్రాంతం నెల వు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో సాగు నీటి లభ్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరి సాగు ఎక్కువగా కనిపిస్తుంది. గతం నుంచి నేటి వరకు రైతులు వరికే మొగ్గు చూపుతూ వస్తున్నారు. 2021 వానకాలంలోనూ రైతన్నలు వరి పంటలకే ఆసక్తి చూపారు. కామారెడ్డి జిల్లాలో గతేడాది కన్నా పత్తి, కంది పంటల సాగును వదిలి వరికే రైతులు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 10,05,993 ఎకరాల్లో పంటల సాగు అంచనాలు ఉండగా నేటి వరకు 9,10,850 ఎకరాల్లో పంటలు సాగుకు నోచుకున్నాయి. ఇందులో వరి పంట సాగు సగానికి ఎక్కువగా ఉండడం విశేషం. సాధారణ పంటల సాగు విస్తీర్ణం 8లక్షల 65వేల ఎకరాలు కాగా అందుకు లక్ష ఎకరాలు అద నంగానే పంటలు సాగయ్యాయి. కాకపోతే వ్యవసాయ శాఖ ప్రతి పాదించిన పంటల సాగుకు విరుద్ధంగా క్షేత్ర స్థాయిలో రైతులు వివిధ పం టలను సాగు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 3.52 లక్షల ఎకరాల్లో, కామారెడ్డి జిల్లాలో 2లక్షల 54వేల ఎకరాల్లో అత్యధికంగా వరి పంటను రైతులు సాగు చేస్తుండడం విశేషం.
నిజామాబాద్లో వరి జోరు…
గతం మాదిరిగానే వరి పంటల సాగు నిజామాబాద్ జిల్లా లో జోరుగా ఉంది. 2020 వానకాలంలో 3లక్షల 86వేల ఎకరాల్లో వరి సాగవ్వగా ఈ సీజన్లో ఇప్పటికే 3లక్షల 52వేల 52వేల 594 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. సాధారణ వరి విస్తీర్ణం 2లక్షల 86వేల ఎకరాలు కాగా 123 శాతం మేర వరి పంటను రైతులు సాగు చేయడం విశేషం. మరికొద్ది రోజుల్లోనే వరి పంట సాగు మరింతగా పెరిగే ఆస్కారం ఉంది. 2019 వానకాలంలో నిజామాబాద్ జిల్లాలో 3,56,661 ఎకరాల్లో వరి సాగు చేశారు. 2020 వానకాలం సీజన్లో వరి సాధారణ విస్తీర్ణం 2,38,138 ఎకరాలుండగా జోరు వానలతో దాదాపు 3,86,156 ఎకరాల్లో వరి సాగైంది. సన్నరకాల సాగులో తెలంగాణ సోనా(ఆర్ఎన్ఆర్), హెచ్ఎంటీ, బీపీటీ 5201, జై శ్రీరాం, గంగా-కావేరి వంటి రకాలను ఇందూరు రైతులు ఎంచు కున్నారు. పప్పు దినుసుల సాగులో గతంలో మాదిరిగానే నిజామాబాద్ జిల్లా వెనుకబాటులో ఉంది. ఇప్పటి వరకు అంచనాలకు విరుద్ధంగా పెసర్లు 443 ఎకరాల్లో, మినుము లు 565 ఎకరాల్లో, కంది 6,219 ఎకరాల్లో, మొక్కజొన్న 26,657 ఎకరాల్లో సాగయ్యాయి. సోయాబీన్ 63వేల 842 ఎకరాల్లో, పత్తి 2,546 ఎకరాల్లోనే సాగుకు నోచుకున్నది. గతేడాది కన్నా పత్తి సాగు తక్కువగానే ఉంది.
కామారెడ్డిలో తగ్గిన పత్తి సాగు..
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భిన్నమైన పంటలు సాగవుతు న్నాయి. 2019లో 47,875 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉండడంతో ప్రభుత్వం పత్తి పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయించాలని సూ చించింది. 2020 వానకాలం సీజన్లో పత్తి సాధారణ విస్తీర్ణం 38,630 ఎకరాలు కాగా 58,496 ఎకరాల్లో తెల్ల బంగారం పంటను సాగు చేశారు. రైతులు పత్తిలో నకిలీ విత్తనాల బారిన పడకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవడం రైతులకు ఊరటనిచ్చింది. ఇప్పటికే పత్తిలో బీటీ3 విత్తనాల పేరుతో వచ్చే విత్తనాలను కొనుగోలు చేయవద్దని సర్కారు హెచ్చరించింది. ప్రస్తుతం 2021 వానకాలం సీజన్లో పత్తి పంట గతం కంటే తక్కువ విస్తీర్ణం లో సాగుకు నోచుకుంది. ఈ సీజన్లో పత్తి సాగు సాధారణ విస్తీర్ణం 42,899 ఎకరాలు కాగా 1,14,857 ఎకరాల్లో పత్తిని సాగు లక్ష్యాలను నిర్ధేశించుకున్నారు. అందుకు భిన్నంగా కేవలం 34,765 ఎకరాల్లోనే పత్తి విస్తరించడం వ్యవసాయాధికారుల పనితనానికి అద్దం పడుతున్నది. రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించకపోవడం, క్షేత్ర స్థాయిలో పర్యటనలు, పర్యవేక్షణ లేకపోవడంతో 2020 వానకాలంతో పోలిస్తే ఈ సారి పత్తి సాగు విస్తీర్ణం పడిపోయినట్లు తెలుస్తోంది. 2019 వానకాలంలో 17,389 ఎకరాల్లో కంది సాగు చేశారు. 2020లో వానకాలంలో 36,004 ఎకరాలకు చేరింది. 2021లో కంది సాగు 17,854 ఎకరాలకే పరిమితమైంది.