బుధవారం 03 జూన్ 2020
Nizamabad - May 15, 2020 , 02:09:20

ఆదుకుంటున్న‘రైతుబంధు’

ఆదుకుంటున్న‘రైతుబంధు’

  • నిజామాబాద్‌ జిల్లాల్లో 62 మంది రైతులకు
  • రూ.96 లక్షల రుణాన్ని అందజేసిన మార్కెట్‌ అధికారులు 
  • పసుపు ధర లేకపోవడంతో కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ 
  • కష్ట కాలంలో ఆదుకుంటున్న పథకం

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ: పసుపు రైతు కు ఎప్పుడూ కష్టాలే. బీటు నడుస్తున్నప్పుడు సరైన ధర లేక ఏండ్లుగా ఇబ్బంది పడుతున్న ప సుపు రైతుకు ‘మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ’ చందంగా లాక్‌డౌన్‌తో మార్కెట్‌ యార్డు లు మూతపడ్డాయి. అంతకుముందు అరకొర ధరకు అమ్ముకున్న పసుపు రైతు ఆ తర్వాత లాక్‌డౌన్‌ పుణ్యమా అని పసుపును తమవద్దే ఉంచుకొని పరిస్థితులు ఎప్పుడు బాగుపడతాయా అని ఎదురుచూసే దుస్థితి ఏర్పడింది. పసుపు మద్దతు ధర, పసుపు బోర్డు అంశం అటకెక్కిన  పరిస్థితులకు తోడు కరోనా వ్యాప్తి  పసుపు రైతును పూర్తిగా కుంగదీసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం పసుపు రైతులకు ఈ ఆపత్కాలంలో ఓ వరంలా మారింది. మార్కెట్‌లో మద్దతు ధర లభించనప్పుడు ఈ పథకం కింద  పంటను నిల్వ చేసుకొని తర్వాత మార్కెట్‌లో మంచి ధర వస్తే అమ్ముకునేందుకు వీలుగా వెసులుబాటు కల్పిస్తున్నది. పెట్టిన పంటకు 75 శాతం రుణాన్ని కూడా రైతులకు అందించి ఆ కష్ట సమయంలో ఆదుకుంటున్నది. ఇచ్చిన రుణానికి ఆరు నెలల పాటు ఎలాంటి వడ్డీ వసూలు చేయదు. ఆరు నెలలపాటు ఆ మొత్తాన్ని రైతులు తమ పంట పెట్టుబడికి, ఇతర ఖర్చులకు వాడుకోవచ్చు. ఆరు నెలల తర్వాత నామమాత్రపు వడ్డీ (పావలా) వసూలు చేస్తారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రైతులు ఈ రైతుబంధు పథకాన్ని వినియోగించుకున్నారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌, కమ్మర్‌పల్లి, వేల్పూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పరిధిలో మొత్తం 62 మంది రైతులు 2,456 క్వింటాళ్ల పసుపును కోల్డ్‌ స్టోరేజీల్లో ఈ పథకం కింద నిల్వ ఉంచి రూ. 96లక్షల రుణాన్ని పొందారు. మరికొంత మంది రైతులు ఈ పథకాన్ని వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. రైతుబంధు పథకం తమను ఆదుకుందని పసుపు రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. కేంద్రం  పసుపుబోర్డు అంశాన్ని అటకెక్కించి స్పైసెస్‌ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించి చేతులు దులుపుకుంది. మరోవైపు కరోనా రైతులను అగాథంలోకి నెట్టేసింది. రైతుబంధు పథకం పసుపు రైతులను కష్టకాలంలో ఆదుకుంటున్నది.


logo