శనివారం 06 జూన్ 2020
Nizamabad - Feb 28, 2020 , 00:14:38

మొక్కలకు నీటిని అందించాలి

మొక్కలకు నీటిని అందించాలి

కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ/ వేల్పూర్‌: గ్రామ పంచాయతీల్లో మొక్కలకు నీటిని అందించే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన కమ్మర్‌పల్లి తహసీల్‌ కార్యాలయాన్ని సందర్శించి పరిశీలించారు. తహసీల్‌ కార్యాలయ ఆవరణలో ఖాళీ స్థలం ఉన్నందున మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యాలయంలోని అన్ని విభాగాలను పరిశీలించారు. తహసీల్‌ కార్యాలయాలకు ప్రభుత్వం కొత్తగా ఎనిమిది బ్యాటరీలు అందించిందని తెలిపారు. వాటికి యూపీఎస్‌ అవసరం ఉన్నందున పనులు చేయడానికి చర్యలు చేపట్టాలని ఏవోకు ఫోన్‌లో సూచించారు. పాత బోర్డులు తొలగించి కొత్త బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. నర్సరీలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల్లో మొక్కలకు నీటిని అందించడానికి అంచనాలు తయారు చేసి ఉపాధి హామీ పథకం ద్వారా నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటింటికి మొక్కలు నాటుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. తహసీల్‌ కార్యాలయం పరిశుభ్రంగా ఉన్నందుకు అభినందించారు. కోనాసముందర్‌, ఇనాయత్‌నగర్‌లో శ్మశాన వాటికలు, కంపోస్టు షెడ్లను పరిశీలించారు. కోనాసముందర్‌ గ్రామ పంచాయతీని సందర్శించారు. గ్రామంలో రోడ్డుకిరువైపులా మొక్కలు నాటడం, పారిశుద్ధ్యం బాగుందని సర్పంచ్‌ను, గ్రామస్తులను అభిసందించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ బావయ్య, ఎంపీడీవో సంతోష్‌ రెడ్డి, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. వేల్పూర్‌ మండల కేంద్రంలో కలెక్టర్‌ ఆకస్మికంగా పర్యటించారు. భీమ్‌గల్‌ పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని తిరిగి జిల్లా కేంద్రానికి వెళ్తుండగా  మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయం, నర్సరీ, రోడ్డుకు ఇరువైపులా హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. తహసీల్‌ కార్యాలయాన్ని పరిశీలించారు. తహసీల్దార్‌ సతీశ్‌రెడ్డిని రెవెన్యూకు సంబంధించిన పెండింగ్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయ పరిసర ప్రాంతాల్లో మొక్కలను పెంచాలని సిబ్బందికి సూచించారు. అనంతరం అమీనపూర్‌ గ్రామ సమీపంలోని నర్సరీని పరిశీలించారు. నర్సరీలో ఏఏ మొక్కలు పెంచుతున్నారని అడిగి తెలుసుకున్నారు. హరితహారంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఎందుకు ఎండిపోతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిసరాల్లో బ్లాక్‌ ప్లాంటేషన్‌కు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీవో కమలాకర్‌రావు, ఎంపీవో జావీద్‌ అలీ, ఏపీవో ఇందిరా, ఎంపీపీ బీమా జమున, సర్పంచ్‌ తీగల రాధ, ఉప సర్పంచ్‌ సత్యం, ఆర్‌అండ్‌బీ ఏఈ వినీత్‌ తదితరులు ఉన్నారు.


logo