వేల్పూర్, జనవరి 8: ఉమ్మడి జిల్లాలోని 2009 బ్యాచ్‌కు చెందిన ఎస్సైలు సామాజిక సేవ చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ‘కన్న ఊరు’ కార్యక్రమంలో భాగంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు చేయూతనిస్తున్నారు. ఇందులో భాగంగా వేల్పూర్ జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 40 మంది పేద విద్యార్థులకు ఆదివారం సైకిళ్లను అందజేశారు.
ఈ కార్యక్రమానికి ఎంఈవో వనజారెడ్డి హాజరై మాట్లాడారు. మండలంలోని వివిధ పాఠశాలలకు విద్యార్థులు ప్రతిరోజూ నడుచుకుంటూ వస్తున్నారని, ఇక నుంచి వారు సైకిళ్లపై వస్తారని తెలిపారు. 2009 బ్యాచ్‌కు చెందిన ఎస్సైలు చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తీగల రాధా మోహన్, మోతె విండో చైర్మన్ రాజేశ్వర్, మోతె సర్పంచ్ రజితా చంద్ర మోహన్‌గౌడ్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, 2009 బ్యాచ్‌కు చెందిన ఎస్సైలు పాల్గొన్నారు.