నిజామాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పసుపు రైతులను కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు నిండాముంచుతున్నాయి. గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేస్తున్నాయి. పసుపు రైతుల సమస్యలపై యంత్రాంగం తూతూ మంత్రంగా స్పందిస్తున్నది. గిట్టుబాటు ధర లేక కడుపు మండిన పసుపు రైతులు మొన్న మెరుపు ధర్నాకు దిగారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద రోడ్డుపై కూర్చుని మద్దతు ధర కోసం నినదించారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం దిగొచ్చి రైతులతో చర్చలకు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్‌ను పంపించింది.
గంటల కొద్దీ రైతులతో చర్చించిన తర్వాత ట్రేడర్లు, పాలకవర్గం, రైతులు, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. కొమ్ము రకం పసుపునకు రూ.9500 క్వింటాకు చెల్లించాలని అంతకు తక్కువగా ఎవ్వరూ కొనుగోలు చేయొద్దని నిర్ణయం తీసుకున్నారు. పసుపు మండకు రూ.8వేలు చెల్లించాలని నిర్ణయించారు. కానీ ఆ నిర్ణయాలు బుట్టదాఖలయ్యాయి. గంటలు గడువక ముందే వ్యాపారులు అత్యాశకు దిగి ఇష్టారీతిన రైతుల నుంచి దోపీడికి రంగం సిద్ధం చేశారు.
అదనపు కలెక్టర్ మాటలను గాలికి వదిలేశారు. ఒప్పందానికి తూట్లు పొడిచి క్వింటా పసుపునకు కొమ్ముకు రూ.8వేలు లోపు చెల్లిస్తున్నారు. మండకు చెల్లించే ధరను మరింత తగ్గిస్తున్నారు. కుంటి సాకులు చెప్పి రైతులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నారు. ఇదంతా ఏమిటంటూ? రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. పసుపు బోర్డు వస్తే పసుపు రైతుకు ఎకరానికి రూ.25వేలు లా భం జరుగుతుందని గొప్పలు చెప్పి న బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంత వరకూ పత్తా లేకుండా పోయాడు. రైతుల దీనావస్థపై కనీసం స్పందించకపోవడం గమనార్హం.
పసుపు క్వింటాకు రూ.15వేలు చెల్లిస్తామంటూ గతంలో బీజేపీ ప్రభుత్వం చెప్పింది. బీజేపీ ఎంపీ ఒకడుగు ముందుకేసి పసుపు బోర్డు స్థాపనతో రైతులకు రూ.25వేల వరకు లాభం జరుగుతుందని మాటలు చెప్పి రైతులను ఆకట్టుకున్నాడు. కాంగ్రెస్ పాలకులు సైతం అసెంబ్లీ ఎన్నికల్లో ఇష్టారీతిన హామీలు ఇచ్చారు. క్వింటా పసుపునకు రూ.12వేలు కచ్చితంగా అమలు చేసి చూపిస్తామన్నారు. పీసీసీ చీఫ్ హోదాలో స్వయంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రస్తుతం క్వింటా పసుపునకు రూ.12వేలు అన్నది మచ్చుకూ కనిపించడం లేదు.
ఒకరిద్దరు రైతులకు ఈ-నామ్లో భారీ ధరలకు పసుపు కొనుగోళ్లు చేసినట్లుగా వ్యవసాయ మార్కెట్ వర్గాలు నమోదు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. గరిష్ఠ, కనిష్ఠ్ట ధరలను ఇష్టారీతిన ఆన్లైన్లో నమోదు చేసి అమోమయంలో రైతులను ముంచేస్తున్నది. ఇవే ధరలు ఉన్నాయనకుని రైతులు మార్కెట్‌కు వచ్చే సరికి రూ.8వేలు వరకు క్వింటా పసుపునకు ధర పలుకుతున్నది. ఒకరిద్దరికి వచ్చే లాభాన్ని మిగిలిన వారికి కూడా అంటగట్టి విష ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రూ.12వేలు మద్దతు ధరను ఇవ్వాల్సి ఉండగా, ఇంత వరకూ ఆ మాటెత్తడం లేదు. రూ.8వేలు నుంచి రూ.10వేలలోపు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన నష్టాన్ని సర్కారే బోనస్‌గా ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పసుపు రైతులకు నష్టాలు తప్ప, లాభం లేకుండా పోతున్నది. ఈ ఏడాది సీజన్ ఆరంభం నుంచి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వారిని పట్టించుకునే నాథుడు కరువవ్వడంతో దళారులు దోచుకుంటున్నారు. దళారులకు తెరవెనుక నుంచి ప్రభుత్వ పెద్దలే మద్దతు తెలుపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. పసుపు రైతుల గోసపై పాలకులకూ పట్టింపు లేకుండా పోయింది. ధరలేని సమయంలో ధైర్యం చెప్పాల్సిన ప్రజా ప్రతినిధులు ఇటువైపే రావడం లేదు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి నియోజకవర్గాల్లో పెద్ద మొత్తంలో పసుపు సాగవుతున్నది. వీరెవ్వరూ పసుపు రైతుల బాధలను ఆలకించడం లేదు. పసుపు రైతుల విషయంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నేరుగా కలెక్టర్‌కు ఫోన్ చేసి పరిస్థితులపై ఆరా తీశారు. వ్యాపారుల మోసాలపై దృష్టి సారించాలని కోరారు.. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న మోసాలపైనా అసెంబ్లీలో గళం వినిపించారు. ఎమ్మెల్సీ కవిత సైతం ఫిబ్రవరి 22న మార్కెట్ యార్డును సందర్శించి రైతుల పక్షాన నిలబడ్డారు. పోరాటానికి సిద్ధం కావాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతుల మెరుపు ధర్నాపైనా స్పందించి పసుపు రైతులకు నేనున్నానంటూ భరోసా కల్పించారు.
ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మానవత్వంతో స్పందించి రైతులకు ధైర్యం చెబుతుంటే.. పాలక పక్షాలు మాత్రం కనీసం పట్టించుకోవడం లేదు. పసుపు రైతుల ఆందోళనలు జరుగుతుంటే బీజేపీ ఎంపీ అర్వింద్ కనీసం స్పందించడం లేదు. ఆయనకు పసుపు రైతుల బాధలు మాత్రం కనబడడం లేదు. 2019, 2024లో అబద్ధపు హామీలతో రెండు సార్లు ఎంపీగా గెలిచినా పసుపు రైతుల సంక్షేమాన్ని గాలికివదిలేశాడు. పేరుకు పసుపు బోర్డు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నప్పటికీ రైతులకు ఎలాంటి ప్రయోజనమూ లేకుండా పోయిం ది. పసుపు బోర్డు వస్తే రైతుకు ఎకరా పంటకు రూ.25వేలు లాభం వస్తుందని వ్యాఖ్యానించాడు. అదేది రైతులకు కనిపించకపోవడంతో బీజేపీ ఎంపీని ప్రశ్నిస్తున్నారు.
అధికారులు పసుపు రైతులను పట్టించుకోవడం లేదు. మా పరిస్థితి ఏం కావా లి. నేను మార్కెట్‌కు వచ్చిన మూడు రో జుల తర్వాత నా పంట బీట్ అయ్యింది. అది కూడా చాలా తక్కువ ధరకు కొన్నారు. రూ.8500 నుంచి రూ.9వేలకు పోయింది. నష్టమే తప్ప, లాభం లేదు.
– ముత్యం రెడ్డి, పసుపు రైతు, నికాల్పూర్
పసుపు బోర్డు వస్తే పసు పు ధర ఆశాజనకం గా ఉంటుందని అనుకు న్నాం. పసుపు బోర్డు వచ్చినా గిట్టుబాటు ధర రావడం లేదు. ఇప్పు డు మార్కెట్లో రూ. 8వే లు, రూ. 9వేలు చెబుతున్నరు. క్వింటా పసుపునకు రూ.15వేలకుపైగా పంట కొనుగోళ్లు జరిగితేనే లాభం ఉంటుంది. రూ.8వేలతో నష్టమే తప్ప లాభం లేదు.
– సింగిరెడ్డి శేఖర్, పసుపు రైతు, కమ్మర్పల్లి