కంఠేశ్వర్, ఫిబ్రవరి 13: సాంప్రదాయ, చేతివృత్తుల వారిని అన్నివిధాలా ప్రోత్సహించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు సూచించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన అర్హులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పీఎం విశ్వకర్మ పథకంపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, జిల్లా పరిశ్రమల కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొని పథకం ఉద్దేశం, ప్రయోజనాలను వివరించారు. 18 కేటగిరీలకు చెందిన చేతివృత్తులు, హస్తకళాకారులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గత ఐదేండ్లలో ప్రభుత్వ రుణాలు పొందని, 18 నుంచి 60 ఏండ్లలోపువారు అర్హులని వవరించారు. ముద్ర, స్వనిధి లబ్ధిదారులు రుణాలను మొత్తం చెల్లిస్తే ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. సదస్సులో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సురేశ్‌కుమార్, ఎంఎస్ఎంఈ అధికారి రాజేశ్‌యాదవ్, బీసీ సంక్షేమాధికారి రమేశ్, ఎస్.సిద్ధ య్య, పంచాయతీ కార్యదర్శులు, సీఎస్సీ ఆపరేటర్లు పాల్గొన్నారు.