ఎల్లారెడ్డి రూరల్ : మేతకు వచ్చిన గొర్రెలపై రేసు కుక్కలు(Dogs Attack ) ఆకస్మాత్తుగా దాడి చేయడంతో 18 గొర్రెలు( Sheeps) మృత్యువాత పడిన ఘటన వెల్లుట్లపేటలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండం వెల్లుట్లపేట గ్రామానికి చెందిన కొరివి నారాయణ సోమవారం ఉదయం సమయంలో తన గొర్రెలను తీసుకొని గ్రామ శివారులో మేతకు తీసుకువెళ్లాడు.
శివారులోని కొట్టాల కర్రే సాయన్నకు చెందిన బావి కట్టు కాలువ వద్ద మేతమేస్తున్న గొర్రెలపై సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి గుంపుగా వచ్చి మీద పడిన రేసుకుక్కలు దొరికిన గొర్రెలను దొరికినట్లుగా కొరికి, చంపి తినేసి గొర్రెల మిగతా శరీర భాగాలను ఎక్కడపడితే అక్కడ పడేసి తిరిగి అడవిలోకి వెళ్లిపోయాయి. దాడిలో మృతి చెందిన 18 గొర్రెల విలువ సుమారు రెండు లక్షల పై చిలుకు ఉంటుందని, తనకు అధికారులు నష్టపరిహారం ఇప్పించాలని బాధితుడు కొరివి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.