మోర్తాడ్, ఆగస్టు 24: సీజనల్ వ్యాధులతో ప్రతి ఒక్కరూఅప్రమత్తంగా ఉండాలని డాక్టర్ రతన్‌సింగ్ సూచించారు. మోర్తాడ్ జీపీలో మంగళవారం ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం మలేరియా, డెంగీ జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ రెండు జ్వరాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాపాయ స్థితికి చేరుకునే ప్రమాదం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఇంటిపరిసరాల్లో దోమలు వృద్ధి చెందకుండా చర్యలు చేపట్టాలన్నారు. నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. శిబిరంలో 102 మందికి ఉచితపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈశిబిరాన్ని సర్పంచ్ బోగ ధరణి, ఉపసర్పంచ్ చొక్కాయిగంగారెడ్డి ప్రారంభించగా, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు సహకరించారు.
తడ్పాకల్లో..
సీజనల్ వ్యాధులు సంభవిస్తున్న నేపథ్యంలో తడ్పాకల్ గ్రామంలో సర్పంచ్ పత్తిరెడ్డి ప్రకాశ్ ఆధ్వర్యంలో మంగళవారం ఆరోగ్య శిబిరం ఏర్పా టు చేశారు. శిబిరంలో ప్రభుత్వ వైద్యురాలు స్టెఫీ రాణి, ఏఎన్ఎం వీణ పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఇండ్ల ను శుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ లోలపు అశోక్, టీఆర్ఎస్ మండల నాయకులు, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
పడగల్లో..
మండలంలోని పడగల్ గ్రామంలో మంగళవారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. వైద్యులు గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. శిబిరాన్ని ప్రత్యేక అధికారి సీహెచ్. విజయ్ కుమార్ పరిశీలించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ అశోక్, సర్పంచ్ ద్యావతి వర్షిణి, హెల్త్ సూపర్వైజర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.