
ఇందూరు, ఆగస్టు 8 : విదేశీ విద్య అనగానే ధనిక, ఉన్నత వర్గాల విద్యార్థులు మాత్రమే వెళ్లేవారు. పేద, మధ్య తరగతి వారికి అది ఓ కలగానే మిగిలేది. 2014 తరువాత ఈ పరిస్థితులు పూర్తిగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం విదేశీ విద్యకు ప్రోత్సాహం అందిస్తున్నది. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు యూకే, యూఎస్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, సౌత్‌కొరియా లాంటి విదేశాల్లో ఎంఎస్, సర్టిఫికెట్ కోర్సు, పీజీ విద్యకు ప్రోత్సాహం కల్పించేందుకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ఎంపిక చేసి ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపుతున్నది. మరోవైపు బీసీ, మైనార్టీ విద్యార్థులకు మహాత్మా జ్యోతి బాపూలే విద్యా పథకం ద్వారా అవకాశం కల్పిస్తున్నది. చదువుకోవాలనే కోరిక ఉండి ఆర్థిక స్థోమత లేని వారికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి విద్యార్థికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందిస్తూ విదేశాల్లో చదువుకునేలా ప్రోత్సాహం కల్పిస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో ప్రతి సంవత్సరం ఎంతో మంది విద్యార్థులు విదేశీ విద్యానిధి పథకానికి ఎంపికై తమ లక్ష్యాలను నెరవేర్చుకుంటున్నారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం, బీసీ విద్యార్థులకు మహాత్మా జ్యోతి బాపూలే విదేశీ విద్యా పథకం, మైనార్టీ విద్యార్థులకు సీఎం ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా డిగ్రీ పూర్తి చేసిన వారికి విదేశాల్లో చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్నది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని ప్రభుత్వం 2014లో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా చదువు పూర్తి చేసుకున్న ఎంతో మంది ఉన్నతస్థానాల్లో స్థిరపడ్డారు.
60 శాతం మార్కులు ఉన్నవారు అర్హులు
అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందాలనుకునే విద్యార్థులు ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.రెండు లక్షల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తించేది. 2018 తర్వాత ప్రభుత్వం రూ.5 లక్షలలోపు వార్షిక ఆదా యం ఉన్న వారికి కూడా అవకాశం కల్పించింది.
అంబేద్కర్ ఓవర్సీస్ పథకానికి 30 మంది..
ఎస్సీ విద్యార్థులు 2014-15 నుంచి 2020-21 వరకు 47 మంది దరఖాస్తు చేసుకోగా 2020 వరకు 27 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. 2021లో ముగ్గురు ఎంపిక కాగా, మొత్తం 30 మంది పై చదువుల కోసం విదేశాలకు వెళ్లారు.
గిరిజన విద్యార్థులు 11 మంది ఎంపిక
2016 నుంచి 2021 వరకు గిరిజన విద్యార్థులు 27 మంది దరఖాస్తు చేసుకోగా 11 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఒక్కో సెమిస్టర్‌కు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షలు వీటితో పాటు వీసా, టికెట్, అడిషనల్ చార్జీలు ఇస్తారు.
మైనారిటీలకు సీఎం ఓవర్సీస్ విదేశీ విద్యానిధి పథకం
మైనార్టీ విద్యార్థుల కోసం సీఎం ఓవర్సీస్ విదేశీ విద్యానిధి పథకం ద్వారా 2016 నుంచి 2021 వరకు 43 మందిని ఎంపిక చేశారు. 98 దరఖాస్తు చేసుకోగా, బడ్జెట్ ప్రకారం 43 మందిని ఎంపిక చేశారు. 2017 వరకు రూ.10 లక్షలు మంజూరు చేసే వారు. 2018 నుంచి రూ.20 లక్షలు అందజేస్తున్నారు. మాస్టర్ డిగ్రీ చదివేందుకు 10 దేశాల్లో అవకాశముంది.
మహాత్మాజ్యోతా బాఫూలే పథకానికి 51 మంది ఎంపిక
మహాత్మాజ్యోతి బాఫూలే విదేశీ విద్యానిధి పథకం ద్వారా 2016-17లో 21 మంది బీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 11 మంది ఎంపికయ్యారు. 2017-18లో 29 మందిరకి గాను 22 మంది ఎంపికయ్యారు. 2018-19 లో 77 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 10 మంది ఎంపికయ్యారు. 2019-20లో 80 మంది దరఖాస్తు చేసుకోగా 34 తిరస్కరించగా 9 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. మిగతా వారు రెండో విడుత ఎంపిక కోసం వెయింటింగ్‌లో ఉన్నారు. 2020-21లో 27 మంది దరఖాస్తు చేసుకోగా ఎంపిక పూర్తి కాలేదు.
విద్యార్థులకు వరం లాంటిది
బీసీ, ఈబీసీ విద్యార్థులకు మహాత్మా జ్యోతి బాపూలే విద్యానిధి పథకం వరం లాంటిది. ఇప్పటివరకు దాదాపు 51 మంది విద్యార్థులు బీసీ, ఈబీసీ విద్యార్థులు ఈ పథకం కింద ఎంపికై ఉన్నతస్థానాలను అధిరోహించారు. 2020-21 సంవత్సరం 27 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంపికలు ఇంకా పూర్తి కాలేదు.
-రమేశ్, బీసీ వెల్ఫేర్ అధికారి
పేద, మధ్య తరగతి గిరిజన విద్యార్థులకు అద్భుత అవకాశం
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్న ఎంతో మంది పేద, మధ్య తరగతి విద్యార్థుల కలను ఈ పథకం సాకారం చేస్తున్నది. ఈ పథకం ద్వారా ఎంతో మంది గిరిజన విద్యార్థులకు విదేశాల్లో మంచి ఉద్యోగం సంపాదించే అవకాశం కలిగింది.
-నాగోరావు, గిరిజన అభివృద్ధి అధికారి
కలలు సాకారం
షెడ్యూల్డ్ కు లాల విద్యార్థుల క లలను నెరవేర్చడానికి ఈ పథకం చే యూతనిస్తున్నది. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న వా రు, డిగ్రీలో 60 శాతం మార్కులున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
-శశికళ, షెడ్యూల్డ్ కులాల అధికారిణి