నిజామాబాద్, ఆగస్టు 10, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీమా సౌకర్యం ఒకప్పుడు సంపన్న కు టుంబాలకు మాత్రమే అన్నట్లుగా ఉండేది. నెలవారీగా, త్రైమాసికం లేదంటే వార్షిక ప్రీమియం చెల్లించాలంటే సామాన్యులకు కుదిరే పని కాదు. పొట్ట గడవడమే కష్టంగా ఉన్న వారికి.. బీమా తీసుకోవ డం తలకు మించిన భారం. వ్యవసాయం చేసుకుంటూ బతుకీడుస్తున్న అన్నదాతలకు బీమా అన్న దే తెలియదు. పొలం పనుల్లో లేదంటే అనారోగ్యం తో కర్షకులు మృతి చెందితే వారి కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరమే. ఈ దీనావస్థను గుర్తించిన సీఎం కేసీఆర్ వారి మేలు కోసం రైతుబీమా పథకాన్ని తీసుకువచ్చారు. గుంట సాగు భూమి ఉన్న రైతుకు కూడా లాభం చేకూరేలా లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ద్వారా ప్రభుత్వమే రైతు ల పేరిట పాలసీలు కట్టి వారి జీవితానికి భరోసాను కల్పిస్తున్నది. 2018-19 ఏడాదిలో మొదలైన రైతుబీమా పథకం మూడేండ్ల పాటు విజయవంతంగా అమలైంది. ఎంతో మంది అభాగ్యులకు అండగా నిలిచింది. రూ.5లక్షల బీమా చెల్లింపుతో రైతు కుటుంబాలను ఒడ్డుకు చేర్చింది. తాజాగా 2021-22లోనూ రైతుబీమాను కొనసాగించేందు కు సీఎం నిర్ణయించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రీమియం పెరిగినా…
వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న అన్నదాతలకు ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబీమా పథకం వారి కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్న ది. ప్రారంభంలో ఇందులో చేరడానికి నిరంతరం అవకాశం ఉండేది. గతేడాది నుంచి వ్యవసాయ శాఖ ఏడాదికోసారి మాత్రమే అవకాశం కల్పిస్తున్నది. రైతు కుటుంబాల్లో ఏదైనా కారణంతో పెద్ద దిక్కు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుం డా ఉండేందుకు, వారికి అండగా నిలిచేందుకు ప్ర భుత్వం రైతుబీమాను అమలు చేస్తోంది. 2018, ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చిన రైతు బీమా ద్వారా సభ్యులుగా నమోదైన రైతు చనిపోతే కు టుంబానికి రూ.5లక్ష పరిహారం వచ్చేలా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. అర్హులైన రైతు చనిపోతే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు విచారించి 15రోజుల్లో పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒకరి పేరిట ఏడాదికి ప్రభుత్వం రూ.3,457 చెల్లిస్తున్నది.2018-2019లో రూ.2,270 చొప్పున ప్రీమియం చెల్లించింది. రైతులకు నయాపైసా భారం లేకుండా రూ. వందల కోట్లను ఎల్ఐసీకి సర్కారే నిధులు కే టాయిచింది. 2020-21లో ఎల్ఐసీ ప్రీమియం మొ త్తాన్ని భారీగా పెంచింది. అయినప్పటికీ సర్కా రు రైతుబీమా పథకాన్ని కొనసాగించింది. 2021-22 లోనూ ఎల్ఐసీ నిర్ణయించే ప్రీమియంకు అనుగుణంగా బీమా వర్తించేలా సర్కారు చెల్లింపులు చేసేందుకు సిద్ధంగా ఉండడం గమనార్హం.
5,493 కుటుంబాలకు మేలు…
రైతుబీమా పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలో దాదాపు ఐదున్నర వేల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. గతంలో అన్నదాత కుటుంబంలో పట్టాదారు చనిపోతే పైసా పరిహారం అందేది కాదు. సీఎం కేసీఆర్ తీసుకున్న వినూత్న పథకంతో ఆ కుటుంబానికి నేడు ఎంతో మేలు జరుగుతున్నది. రైతుబీమాకు పట్టాదారు పాస్బుక్కు కలిగి ఉన్న ప్రతి రైతుడిని అర్హుడిగా తేల్చారు. బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ(ఐఆర్డీఏ) నిబంధనల మేరకు బీమా సౌక ర్యం పొందే వ్యక్తుల వయస్సు తప్పకుండా 18 – 59ఏండ్లలోపు ఉన్న వారే అర్హులు. నిర్ధిష్ట వయసు కలిగిన వారికి గుంట భూమి ఉన్నప్పటికీ ఈ పథ కం వర్తించేలా డిజైన్ చేశారు. అనేక కారణాలతో అకాల మరణం చెందుతున్న రైతు కుటుంబాల కన్నీళ్లు తుడవడమే రైతు బీమా పథకం ప్రధాన ఉద్దేశం. నిజామాబాద్ జిల్లాలో మూడేండ్లలో 2,616 మంది రైతులు ఆయా కారణాలతో మరణించగా వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున బీమా డబ్బులు అందాయి. దాదాపు రూ.130.80 కోట్లు చెల్లింపులు జరిపారు. కామారెడ్డి జిల్లాలో 2,877 మంది రైతులు చనిపోతే రూ.5లక్షలు చొప్పున అర్హులైన ఆయా కుటుంబాలకు ఎల్ఐసీ ద్వారా రైతుబీమా కింద రూ. 143.50 కోట్లు అందించారు. ఉమ్మడి జిల్లాలో 5,493 మందికి బీమా పరిహారం అందింది.
రైతుకు పెద్ద దిక్కుగా…
రైతు కుటుంబాలకు ఆర్థికంగా చేదోడు కల్పించేందుకు రైతుబీమా పథకాన్ని రూపొందించారు. 2021-22 సంవత్సరానికి రైతుబీమా వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ పథకం ఇప్పటికే చాలా మంది రైతు కుటుంబాలకు పెద్ద దిక్కు గా నిలిచింది. లక్షలాది మంది రైతులు బీమాకు అర్హులుగా ఉన్నారు. మూడేండ్లలో రైతుబీమాకు అర్హులైన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. నిజామాబాద్ జిల్లాలో 2018-19లో 1.33లక్షల మంది ఉండగా 2020-21లో 1.55లక్షలకు పెరిగారు. కామారెడ్డి జిల్లాలో 2018-19లో రైతుబీమా అర్హుల సంఖ్య 1.31లక్షల మంది ఉండగా 2020-21లో 1.68లక్షల మందికి చేరారు. 2021-22లోనూ రైతుబీమా వర్తించబోయే రైతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు గా తెలుస్తున్నది. ఏడాది కాలంలో భూముల క్రయవిక్రయాలతో పట్టాదారులు చాలా మంది కొత్తగా చేరిన వారున్నారు. వీరందరూ రైతుబీమాకు దరఖాస్తు చేస్తే నిబంధనలకు మేరకు బీమా వర్తిస్తుంది. దరఖాస్తులను ఏఈవోలు స్వీకరిస్తున్నప్పటికీ ఆన్లైన్లో వివరాల నమోదుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.