నిజామాబాద్, ఏప్రిల్ 12, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ వడ్లను కొనబోమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెగేసి చెప్పినా… అన్నం పెట్టే రైతన్న ఆగం కావొద్దని సీఎం కేసీఆర్ గొప్ప మనసుతో చివరిగింజ వరకూ కొంటామని చెప్పడం హర్షణీయం. రైతులకు భరోసానిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. కేంద్రంతో వడ్లు కొనిపిస్తాం.. వరి వేయండి అని రెచ్చగొట్టిన బీజేపీ నాయకులు పత్తా లేకుండా పోయారు. రైతన్నలు ఇకనైనా ఆలోచించాలి. కేసీఆర్ ఉండగా తెలంగాణకు, రాష్ట్ర రైతాంగానికి ఏమీ కానివ్వరు.
రైతన్నా… నేనున్నానంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కొండంత భరోసాను కల్పించారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు ఎవరూ కొనకపోతే రైతులు ఆగమయ్యే దుస్థితి నెలకొంటుంది. రాష్ట్రంలోని రైతు కన్నీరు పెట్టకూడదన్న కారణంతో కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినప్పటికీ ధాన్యం కొనుగోళ్లకు సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపారు. ఎప్పటి లాగే అత్యంత పారదర్శకంగా, కచ్చితత్వంతో రైతుల కష్టానికి తగిన ఫలితం అందించేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు సిద్ధమవుతున్నారు. ఒకట్రెండు రోజుల్లోనే సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయడం, వీలైనంత త్వరగా కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించడానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధం అవుతున్నది. గతంలో మాదిరిగానే కొనుగోలు కేంద్రాలను విరివిగా నెలకొల్పి రైతు చెంతకెళ్లి ధాన్యాన్ని సేకరించబోతున్నారు.
12లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం రాక…
యాసంగిలో ఉమ్మడి జిల్లాలో సాగైన పంటల విస్తీర్ణం ఆధారంగా వ్యవసాయ శాఖ ఇప్పటికే అంచనాలు సిద్ధం చేసింది. వీటిలో బై బ్యాక్ ఒప్పందాల్లో భాగంగా కొంత మంది రైతులు ఇతరులకు విక్రయించుకున్నప్పటికీ మిగిలిన వారి నుంచి భారీగానే ధాన్యం మార్కెట్‌కు రానున్నది. పౌరసరఫరాల సంస్థ అధికారుల అంచనాల మేర కు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఈసారి యా సంగిలో 12లక్షల మెట్రిక్ టన్నులు మేర ధాన్యం దిగుబడులు వచ్చే వీలుంది. నిజామాబాద్ జిల్లాలో 8.80 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తుందని భావిస్తుండగా ఇందులో 7లక్షల మెట్రిక్ టన్నుల వరకు ప్రభుత్వ కేంద్రాలకు ధాన్యం తరలిరానున్నది. కామారెడ్డి జిల్లాలో 4లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తుందని అంచనాలున్నాయి. వీటిలో 3లక్షల మెట్రిక్ టన్నులు వరకు కొనుగోలు కేంద్రాలకు చేరనున్నది. గత వానకాలంలో నిజామాబాద్‌లో 427 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 6.86 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. కామారెడ్డిలో 340 కొనుగోలు కేంద్రా ల ద్వారా 4.83 లక్షల మెట్రిక్ టన్ను లు సేకరించారు. ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్ ద్వారా కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. రైతులెవ్వరూ ప్రైవేటు దోపిడీదారుల చేతికి చిక్కి విలవిల్లాడే అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరను అందించనున్నది.
సాహసోపేత నిర్ణయం..
ధాన్యం కొనుగోలు అంశంలో రాష్ట్రంపై గడిచిన రెండేండ్లుగా కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత వైఖరిని అవలంబిస్తున్నది. బాయిల్డ్ రైస్, రా రైస్ పేరుతో రాజకీయం చేస్తూ రైతులను, ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తున్నది. గతానికి భిన్నంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పేచీలపై టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నది. రైతులను రోడ్డున పడేసేందుకు కంకణం కట్టుకున్న బీజేపీ తీరుపై ఉద్యమాలు నిర్వహించింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు దీక్షలు చేపట్టింది. దేశ రాజధానిలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్ష చేపట్టి కేంద్రం తీరును సభ్య సమాజానికి తెలియజేశారు. కేంద్రం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు ఎక్కడికక్కడ ఎండగట్టగా రాష్ట్ర రైతులు నష్టపోకూడదనే ఆశయంతో ప్రభుత్వానికి నష్టం వచ్చినప్పటికీ రైతుకు మేలు చేయాలని సీఎం సంకల్పించారు. అందుకు అనుగుణంగా కొనుగోళ్లకు మంత్రి మండలి ఓకే చెప్పడంతో రైతుల్లో గుబులు పో యింది. కర్షకులంతా కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నారు. కార్పొరేట్ దొంగలకు సంబంధించిన రూ.వేల కోట్లు మాఫీ చేస్తున్న మోదీ సర్కారు… దేశానికి అన్నం పెడుతున్న రైతు విషయంలో భారం మోసేందుకు సిద్ధంగా లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం అవుతున్నది. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదిగా కర్షకలోకం భావిస్తున్నది.
రైతుల గుండెచప్పుడు కేసీఆర్రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
యాసంగిలో రైతులు పండించిన వడ్లను కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయబోమని చేతులెత్తేసిందని తెలిపారు. కానీ రైతులకు నష్టం వాటిల్లకూడదని ధాన్యం కొనుగోలుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. రైతులకు నష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని, రైతులను మోసం చేస్తూ బీజేపీ నేతలు పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం చివరి ధాన్యపు గింజ వరకూ కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లిస్తుందని తెలిపారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని గ్రామగ్రామాన రైతులు ఎండగట్టాలని కోరారు. సీఎం కేసీఆర్ రైతాంగానికి నష్టం జరగనివ్వరని, అన్నదాతలకు అండగా ఉంటారన్న విషయం మరోసారి రుజువైందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రాష్ట్రం కొనడం హర్షణీయం
కేంద్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో తెలంగాణపై వివక్ష చూపినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొంటామని ప్రకటించడం హర్షణీయం. రైతుల కోసం పాటుపడుతున్నదెవరో రైతులకు తెలిసిపోయింది. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా రైతుల క్షేమాన్ని గాలికొదిలేసిన కేంద్ర ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతాం.
-అర్గుల్ రాజేశ్వర్‌రెడ్డి, రైతు నాయకుడు, ధర్పల్లి
రైతుల బాగోగులు ఆలోచిస్తరు..
సీఎం కేసీఆర్ ఎప్పుడూ రైతుల బాగోగుల గురించి ఆలోచిస్తారని మరోమారు రుజువైంది. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినా సీఎం కేసీఆర్ ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని ప్రకటించడం ఎంతో భరోసా నిచ్చింది. ప్రభుత్వమే కొనుగోలు చేయడంతో ఎంతో లాభం కలుగుతుంది.
-వెల్మల గంగాధర్, రైతు, సీహెచ్ కొండూర్
ఆనందంగా ఉన్నది..
కేంద్రం కుట్రలను పసిగట్టి వరి సాగు చేయవద్దని సీఎం కేసీఆర్ రైతులకు సూచించారు. అయినప్పటికీ ఇక్కడి భూములు వరి పంటకు అనుకూలంగా ఉండడంతో అదే పంటను సాగు చేశాం. రాష్ట్రంలో పండిన వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం ఇబ్బందులు పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించడం ఆనందంగా ఉంది.
-గొడిసెల నర్సింహులు, నస్రుల్లాబాద్
బీజేపీకి నూకలు చెల్లినట్లే..
డిచ్పల్లి, ఏప్రిల్ 12 : యాసంగిలో తెలంగాణ వడ్లు కొనబోమని మొండిపట్టు పట్టిన బీజేపీకి నూకలు చెల్లినట్లే. ధాన్యం కొనుగోలు చేయాలని 20రోజులుగా రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కేంద్రం మొండి వైఖరిని వీడలేదు. బీజేపీ నాయకులు గ్రామాల్లోకి వస్తే తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
-నీరడి పద్మారావు, రైతు, బర్దీపూర్
దళారులకు అమ్ముకోవద్దు..డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి
బీర్కూర్, ఏప్రిల్ 12: రైతులు పండించిన వడ్లను తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవద్దని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి సూచించారు. తెలంగాణ రైతాంగం ఇబ్బందులను చూసి సీఎం కేసీఆర్ వడ్లు కొనుగోలు చేస్తామని ప్రకటించడం సంతోషదాయకమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాలుకు రూ.1960 అందిస్తోందని, వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేస్తామని ప్రకటనలో తెలిపారు.
రైతుల తరఫున సీఎంకు కృతజ్ఞతలు
ధర్పల్లి, ఏప్రిల్ 12 : ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వడ్లు కొంటామని ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. రైతుల కోసం ఆలోచించే నాయకుడంటే సీఎం కేసీఆరేనని మరోసారి రుజువైంది. కేంద్ర ప్రభుత్వంలా స్వార్థ రాజకీయాల కోసం కాకుండా రైతు సంక్షేమమే ధ్యేయంగా నిర్ణయం తీసుకుంటున్న కేసీఆర్‌కు రైతులు రుణపడి ఉంటారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనుండడం ఎంతో సంతోషకరమైన విషయం.
– పీస్ రాజ్‌పాల్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు,
ధర్పల్లి మండల కన్వీనర్
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్
మాక్లూర్, ఏప్రిల్ 12 : సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని మరోసారి నిరూపితమైంది. వడ్లు కొంటామని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కేంద్రంలో ఉన్న బీజేపీకి చెంప పెట్టులాంటిది. రైతులను ఆదుకునే సత్తా దేశంలో కేసీఆర్‌కే ఉంది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో రైతుల కష్టాలు దూరం కానున్నాయి. ఇది చూసి బీజేపీ రాష్ట్ర నాయకులు సిగ్గుతో తలదించుకోవాలి.
-న్యాలకంటి భోజన్న, రైతు, ముల్లంగి(బీ)
కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పండిన వడ్ల కొనుగోలు విషయంలో కొర్రీలు పెట్టినా సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నారు. రైతులు దళారుల బారిన పడి మోసపోయే ప్రమాదం ఉందని నష్టమైనా ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించారు. రైతులు నష్టపోకుండా సీఎం సార్ తీసుకున్న నిర్ణయం హర్షణీయం.
-ఇల్లెందుల సాయాగౌడ్, రైతు, నస్రుల్లాబాద్
సీఎం ప్రకటన ఎంతో ఆనందాన్నిచ్చింది
రైతుల బాధను ఎరిగిన సీఎం కేసీఆర్ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. రైతులకు అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు. రైతుల కష్టాలను ఎరిగిన నాయకుడిగా దేశంలోనే పేరొందారు. ఆయన చేపడుతున్న రైతు పథకాలు దేశానికే ఆదర్శం. ఆయన వరిధాన్యం కొనుగోలు చేయడంకన్నా సంతోషకరమైన విషయం మరొకటి ఉండదు.
– కుర్మ హన్మాండ్లు, రైతు, సంబాపూర్.
కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వడ్లు కొనబోమని మొండికేసినప్పటికీ సీఎం కేసీఆర్ రైతాంగాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో కొనుగోలు చేస్తామని ప్రకటించడం శుభపరిణామం. కేసీఆర్‌కు రైతులమంతా రుణపడి ఉంటాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతులంతా అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఈ తీపి కబురుతో యావత్ తెలంగాణ రైతాంగం ఎంతో సంతోషంగా ఉన్నది.
-కిష్టారెడ్డి, రైతు, సుద్దులం